భారత్‌లో అధిక దిగుబడి...పాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఆహార కొరత!

November 05, 2021


img

భారత్‌లో గత రెండు మూడేళ్ళుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో కేంద్రం వద్ద నిలువలు పేరుకొని పోయాయి. దాంతో వచ్చే సీజనులో బియ్యం కొనలేమని చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో చైనాతో సహా పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంక దేశాలలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. మిగిలిన మూడు దేశాల పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు కానీ భారత్‌ కంటే అన్ని రంగాలలో ఎంతో ముందున్న చైనాలో కూడా త్వరలో ఆహార సంక్షోభం ఏర్పడబోతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

చైనాలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడం, దానిపైనే ఆధారపడి ఉన్న బ్యాంకింగ్, ఫైనాన్స్, రవాణా, సిమెంట్, స్టీల్ వగైరా పరిశ్రమలు ఢీలాపడటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

ఇక పాకిస్థాన్‌ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఉగ్రవాదం అజెండాగా సాగుతుండటం అందరూ చూస్తున్నారు. దీనికి తోడు పాలకులకు దూరదృష్టి లేకపోగా అవినీతిపరులు, అసమర్ధులు కావడం, ఆ కారణంగా వారు భారత్‌ను బూచిగా చూపిస్తూ దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తుండటమే పాక్‌ ప్రస్తుత దయనీయ స్థితికి ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి. 

ఇక ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల పాలన మొదలయ్యాక అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆకలి బాధకు తాళలేక చిన్నారులు చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తక్షణమే ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌కు చేయూతనందించకపోతే రాబోయే 5 నెలల్లో వేలసంఖ్యలో ఆకలి చావులు ఉంటాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 


శ్రీలంకలో సేంద్రీయ వ్యవసాయ పద్దతులను కటినంగా అమలుచేయడం వలన ఈసారి తగినంత ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగక ఆహార కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. 

అయితే వీటన్నిటికీ భిన్నమైన వాతావరణం భారత్‌లో కనిపిస్తోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధమైన విధానాలు అమలుచేస్తుండటంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కనుక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నాయి. ఆసియా దేశాలలో ఆహార కొరతతో సతమతమవుతుంటే, భారత్‌ అధికోత్పత్తితో సతమతమవుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే కదా? 


Related Post