టిఆర్ఎస్‌ ప్రభుత్వం మెడకు దళిత బందు గుది బండ?

November 05, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముందు టిఆర్ఎస్‌ ప్రభుత్వం హడావుడిగా దళిత బంధు పధకం ప్రకటించడం, దానిపై అధికార ప్రతిపక్షాల మద్య తీవ్రస్థాయిలో జరిగిన వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణలు అందరూ విన్నారు. దాంతో హుజూరాబాద్‌లో తమ ప్రత్యర్ధులను దెబ్బతీసి రాజకీయ లబ్ది పొందుదామని ప్రయత్నించి టిఆర్ఎస్‌ భంగపడింది. ఇప్పుడు దానినే టిఆర్ఎస్‌ ప్రభుత్వం మెడకు గుదిబండలా తగిలించేందుకు బిజెపి సిద్దమవుతోంది. ఇప్పుడు ఉపఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయింది కనుక తక్షణం దానిని హుజూరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. ఒకవేళ అమలుచేయకపోతే అమలుచేసేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

ఎన్నికల సమయంలో టిఆర్ఎస్‌ కూడా ఆ పధకాన్ని తప్పకుండా అమలుచేస్తామని పదేపదే చెప్పింది కనుక ఇప్పుడు దానిపై వెనకడుగు వేయలేని పరిస్థితి స్వయంగా కల్పించుకొంది. హుజూరాబాద్‌ ఎన్నికల వేడిలో రాష్ట్ర ప్రభుత్వం వాసాలమర్రి, హుజూరాబాద్‌ నియోజకవర్గాలకు కలిపి 2007.69 కోట్లు విడుదల చేసింది. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా జవాబు చెప్పేందుకు అదే ఊపులో రాష్ట్రంలో మరో నాలుగు మండలాలకు కూడా దళిత బంధు పధకం ప్రకటించింది. కనుక ఇప్పుడు ఆ పధకాన్ని అమలుచేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే! 

కానీ దానిని అమలుచేయాలంటే భారీగా నిధులు అవసరం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం వద్ద నిధులు లేకపోయినా దానిని అమలుచేయడానికి నిధులు సమకూర్చుకోక తప్పదు. ఏ కారణం చేతైనా దానిని అమలుచేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే బిజెపి రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా బిజెపి నేతలు ప్రభుత్వాన్ని ఎండగట్టడం ఖాయం. ఒకవేళ ఏదోవిదంగా నిధులు సమకూర్చుకొని ఈ పధకాన్ని అమలుచేయడం మొదలుపెట్టినా, మిగిలిన వర్గాల ప్రజలకు కూడా బంధు పధకాలు అమలుచేయాలని ప్రతిపక్షాలు ఒత్తిడి చేయడం ఖాయం. దళిత బంధును అమలుచేయడమే కష్టమనుకొంటే ఇటువంటివి మరికొన్ని బంధులు అమలుచేయడం  అసాధ్యం...అసంభవం అని వేరే చెప్పక్కరలేదు. 

కనుక దళిత బంధు పధకంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలను నామరూపాలు లేకుండా చేయాలని టిఆర్ఎస్‌ ప్రయత్నిస్తే, ఇప్పుడు అదే పధకాన్ని టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి గుది బండలా తగిలించి టిఆర్ఎస్‌పై పైచేయి సాధించేందుకు బిజెపి సిద్దమవుతోంది. కనుక దళిత బంధు పధకం టిఆర్ఎస్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారిందని చెప్పక తప్పదు. చేజేతులా సృష్టించుకొన్న ఈ సమస్యను సిఎం కేసీఆర్‌ ఏవిదంగా పరిష్కరిస్తారో చూడాలి.


Related Post