టిఆర్ఎస్‌ గర్జన...దేవన్నపేట రైతులు హడల్

November 04, 2021


img

పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు టిఆర్ఎస్‌ విజయ గర్జన సభ దేవన్నపేట రైతులకు పెద్ద కష్టాలు తెచ్చిపెట్టింది. సుమారు 10-15 లక్షల మందితో యావత్ దేశం టిఆర్ఎస్‌ శక్తిని గుర్తించేలా ఈ సభను నిర్వహించాలని టిఆర్ఎస్‌ సంకల్పించడంతో అంత భారీ సభకు అన్నివిదాల సరిపడే స్థలం కోసం టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు వరంగల్‌లో పలు ప్రాంతాలను పరిశీలించారు. చివరికి హన్మకొండ జిల్లాలోని దేవన్నపేటను ఎంపిక చేశారు. అక్కడ ఖాళీ స్థలాలు, రైతుల భూములతో కలిపి 1,100 ఎకరాలను తీసుకొన్నట్లయితే సభను అట్టహాసంగా నిర్వహించుకోవచ్చని నిర్ణయించారు. దేవన్నపేట మీదుగా ఉన్న జాతీయ రహదారి 163 బైపాస్ రింగు రోడ్డు హైదరాబాద్‌ నగరం నుండి చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా అక్కడకు చేరుకోవడం సౌకర్యంగా ఉంటుందని టిఆర్ఎస్‌ నేతలు భావించడంతో దేవన్నపేటనే విజయగర్జనకు ఖరారు చేశారు. 

అయితే దేవన్నపేట రైతులు అందుకు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దేవన్నపేటలో ఎంపిక చేసిన ప్రదేశంలో రైతులు ప్రస్తుతం కూరగాయలు, పత్తి, వరి పండిస్తున్నారు. కనుక సభ కోసం తమ పొలాలు ఇవ్వలేమని చెప్పారు. సభ ఏర్పాటు చేస్తే తమ పంటలన్నీ నాశనం అవుతాయని చెప్పారు. సభ కోసం పొలాల మద్య ఉండే సరిహద్దు రాళ్ళను తొలగించి భూములను చదును చేస్తే ఆ తరువాత ఎవరి పొలం ఎంతవరకు ఉందో తెలియాయక రైతుల మద్య గొడవలు మొదలవుతాయని, ఆ తరువాత కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందని కనుక వేరే ప్రాంతంలో సభను ఏర్పాటు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 

2017లో హన్మకొండ జిల్లాలోనే టిఆర్ఎస్‌ పార్టీ ‘ప్రజల ముందు..ప్రగతి నివేదన సభ’ను నిర్వహించినప్పుడు అక్కడి రైతులకు ఇటువంటి కష్టనష్టాలు, సమస్యలే ఎదుర్కొన్నారని, నేటికీ కొందరు రైతులు తమ భూముల కోసం తోటి రైతులపై కేసులు వేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని దేవన్నపేట రైతులు తెలిపారు. కానీ టిఆర్ఎస్‌ నేతలు అక్కడే సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతుల ఆమోదంతోనే అక్కడ సభ నిర్వహించుకొంటామని టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నారు. దీంతో టిఆర్ఎస్‌ నేతల గర్జనలు విని దేవన్నపేట రైతులు గజగజ వణికిపోతున్నారు. పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదే కదా?


Related Post