హుజూరాబాద్‌ బాధ్యత ఇప్పుడు ఎవరిది?

November 04, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలు ముగిశాయి. కనుక ఇప్పుడు నియోజకవర్గం అభివృద్ధికి ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నకు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్‌, యావత్ రాష్ట్రానికి బాధ్యత వహిస్తున్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం జవాబు చెప్పవలసి ఉంది. 

ప్రజలు ఆయనపై నమ్మకం, అభిమానంతో భారీ మెజార్టీతో గెలిపించారు కనుక ఆయనదే పూర్తి బాధ్యత అవుతుంది. కానీ ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను ఓడగొట్టి సిఎం కేసీఆర్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలకు మరింత బద్ద శత్రువు అయ్యారు. కనుక హుజూరాబాద్‌ అభివృద్ధికి టిఆర్ఎస్‌ ప్రభుత్వం సహకరిస్తుందా?ఒకవేళ సహకరిస్తే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది తప్ప టిఆర్ఎస్‌కు దక్కదు. కనుక సహకరించకపోవచ్చని అర్ధమవుతోంది. ఒకవేళ తాను గెలిస్తే పరిస్థితి ఈవిదంగా ఉంటుందని ఈటలకు తెలియదనుకోలేము. కనుక ఆయన ఏవిదంగా నియోజకవర్గం అభివృద్ధి చేస్తారో...అసలు చేస్తారో చేయరా...అనేది రాబోయే రోజుల్లో అందరూ చూడవచ్చు. 

గత రెండు నెలలుగా నియోజకవర్గంలో మకాం వేసిన మంత్రి హరీష్‌రావు హుజూరాబాద్‌ అభివృద్ధి తన బాధ్యత అని పదేపదే నొక్కి చెప్పారు. నియోజకవర్గంలో 5,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించి ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే దళిత బంధు హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని అమలుచేసింది కాదని, దళితుల సంక్షేమం కోసమే ఈ పధకం తెచ్చామని, ఉపఎన్నిక ప్రక్రియ పూర్తవగానే ఈ పధకాన్ని అమలుచేస్తామని సిఎం కేసీఆర్‌ ప్లీనరీలో ప్రకటించారు. నవంబర్‌ 4వ తేదీన మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ముగ్గురూ నియోజకవర్గానికి వచ్చి దళిత బంధు పధకాన్ని పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కనుక వారూ, సిఎం కేసీఆర్‌ ఇచ్చిన ఈ హామీలను ఇప్పుడు అమలుచేస్తారా? లేదా ప్రజలు తమను తిరస్కరించినందున ఆ హామీలు అమలుచేయవలసిన అవసరం తమకు లేదని చేతులు దులుపుకోబోతున్నారా?అనేది త్వరలోనే తెలుస్తుంది. 

ఒకవేళ టిఆర్ఎస్‌ ప్రభుత్వం, ఈటల రాజేందర్‌ పైన పేర్కొన్న వేర్వేరు కారణాల చేత హుజూరాబాద్‌ అభివృద్ధికి చొరవ చూపకపోతే అప్పుడు ఏమి చేయాలో ప్రజలే ఆలోచించుకోవాలి.


Related Post