కోవ్యాక్సిన్‌ అనుమతించేందుకు ఏడు నెలలా?

November 03, 2021


img

భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్‌ దేశవ్యాప్తంగా కోట్లాదిమందికి వేశారు. అది కరోనా మహమ్మారిని సమర్ధంగా అడ్డుకొంటోందని రుజువైంది కూడా. అయితే అమెరికా తదితర యూరోప్ దేశాలు తయారుచేసిన వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి పెద్దగా సమయం తీసుకోని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ తయారుచేసిన కోవాక్సిన్‌ వినియోగానికి అనుమతించేందుకు మాత్రం కొర్రీలు వేస్తూ ఏడు నెలల సమయం తీసుకొంది. 

గత ఏడాది కరోనా ప్రపంచ దేశాలపై విరుచుకుపడింది కనుక అమెరికా, యూరోప్ దేశాలు అందుబాటులోకి తెచ్చిన వ్యాక్సిన్‌లకు అత్యవసర వినియోగానికి అనుమతించి ఉండవచ్చని సర్ది చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంత అత్యవసర పరిస్థితి లేదు కనుక కోవాక్సిన్‌ను అనుమతించడానికి సమయం పట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్ధిచెప్పుకోవచ్చు. కానీ అమెరికా, యూరోప్ దేశాలు తమ వ్యాక్సిన్‌లను అమ్ముకొని భారీగా లాభాలు ఆర్జించేందుకు వెసులుబాటు కల్పించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాక్సిన్‌ను అనుమతించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ వ్యాక్సిన్‌కు సంబందించిన అన్ని సర్టిఫికెట్స్ భారత్‌ బయోటెక్ కంపెనీ కేంద్రప్రభుత్వం ప్రభుత్వానికి అందజేసిన తరువాతే భారత్‌లో కోవ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు కదా?భారత్‌లో కోట్లాదిమందికి ఇస్తున్న కోవాక్సిన్‌ను అనుమతించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంత సమయం తీసుకోవలసిన అవసరం ఏమిటి?

అమెరికాకు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ తయారుచేసిన కోవీషీల్డ్ వాక్సిన్‌కు కేంద్రప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన అనుమతులు మంజూరు చేయడమే కాక భారత్‌లో దానినే ప్రధానంగా వినియోగించేందుకు అనుమతించింది కూడా. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా తాత్సారం చేయడంతో నేటికీ చాలా దేశాలు కోవాక్సిన్‌ వినియోగానికి అనుమతించడం లేదు. కనీసం ఆ వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకొన్నవారిని గుర్తించడం లేదు. తమ దేశంలో అడుగుపెట్టనీయడం లేదు!

విదేశీ కంపెనీలు తమ వ్యాక్సిన్‌లను భారత్‌లో అమ్ముకోవచ్చు కానీ భారత్‌ తయారు చేసిన కోవాక్సిన్‌ మాత్రం విదేశాలలో అమ్ముకోవడానికి ఇంతవరకు అనుమతించకపోవడాన్ని ఏమనుకోవాలి? భారత్‌ తయారు చేసిన ఈ అద్భుతమైన వ్యాక్సిన్‌ను విదేశాలలో వినియోగానికి అనుమతించకపోవడం వలన భారత్‌ బయోటెక్ కంపెనీ లాభాలు గడించలేకపోయి ఉండవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఆల్లాడుతున్న అనేక పేద దేశాలకు అతి తక్కువ ధరకు కోవ్యాక్సిన్‌ అందకుండా చేసిన పాపం ప్రపంచ ఆరోగ్య సంస్థదే అని చెప్పక తప్పదు. కనీసం ఇప్పటికైనా అనుమతించినందుకు సంతోషం.


Related Post