కాంగ్రెస్ పార్టీలో హుజూరాబాద్‌ లొల్లి

November 03, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ  డిపాజిట్ కోల్పోవడంతో మళ్ళీ నేతల కీచులాటలు మొదలయ్యాయి. అయితే రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కారణంగా ఈ సాకుతో కీచులాడుతున్నారా లేదా హుజూరాబాద్‌లో పార్టీ ఓడిపోయిందనే బాధతోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఈ ఉపఎన్నికలో బిజెపితో కాంగ్రెస్‌ చేతులు కలిపిందని మంత్రి హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి తదితర టిఆర్ఎస్‌ నేతలు ఆరోపించారు. 

వాటిని ఖండించవలసిన కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేవరకు పార్టీ అభ్యర్ధిని ఖరారు చేయలేదు. నియోజకవర్గంలో ఒక్క సభ కూడా నిర్వహించలేదు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ దానిని సరిగ్గా వినియోగించుకోవడంలో మా నాయకులు విఫలమయ్యారు. నిజానికి దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో పనిచేసినట్లు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు పనిచేయలేదు. ఇటువంటి పరిస్థితులలో శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడు కనుక టిఆర్ఎస్‌ను ఓడించేందుకు మేము బిజెపికి మద్దతు ఇవ్వక తప్పలేదు. ఇక్కడ పరిస్థితిని వివరిస్తూ మా పార్టీ అధిష్టానానికి లేఖ వ్రాస్తాను,” అని అన్నారు. 

ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, “ఈ ఉపఎన్నికలో బల్మూరి వెంకట్‌ను అభ్యర్ధిగా ప్రకటించి బలిపశువుగా నిలిపారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఎన్నికల ఇన్‌ఛార్జ్ భట్టి విక్రమార్క అతనిని అభ్యర్ధిగా నిర్ణయించారు కనుక హుజూరాబాద్‌లో ఓటమికి వారిరువురే పూర్తి బాధ్యత వహించాలి. కానీ మేము ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం వలననే ఓడిపోయామని చెపుతున్నారు. హుజూరాబాద్‌కు మేము వచ్చి ప్రచారం చేస్తే కాంగ్రెస్‌ పార్టీ గెలిచేదా?” అని అన్నారు. 

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తన బందువైన పాడి కౌశిక్ రెడ్డి పట్ల ఉన్న ప్రేమాభిమానాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచాయి. పార్టీ గురించి ఆలోచించకుండా వ్యక్తుల గురించి ఆలోచించడం వలనే ఈ దుస్థితి ఏర్పడింది,” అని అన్నారు. 

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాత్రం ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని అన్నారు. ఈ ఓటమితో తనలో మరింత కసి పెరిగిందని అన్నారు. పార్టీ కార్యకర్తలు నిరాశ చెందవద్దని వారికి అండగా తాను నిలబడతానని అన్నారు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నిక సిఎం కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మద్య జరిగిన యుద్ధమని అందరికీ తెలుసు. కనుక దానిలో ఎవరు వేలు పెట్టినా నలిగిపోతారని తెలుసు. అందుకే సీనియర్ కాంగ్రెస్‌ నేత కొండా సురేఖ కూడా పోటీ చేసేందుకు నిరాకరించారు. కనుక హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? దానికి ఎవరు బాధ్యులు? అని చర్చించడం కంటే బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఎందుకు ఇంత తక్కువ ఓట్లు వచ్చాయని ఆలోచిస్తే మంచిదేమో? కానీ రేవంత్‌ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేని నేతలు ఈ ఓటమితో రేవంత్‌ రెడ్డిని కార్నర్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతల ఈ తీరు మారడం లేదు కనుకనే పార్టీ తుడిచిపెట్టుకుపోతోందని చెప్పవచ్చు. 


Related Post