ప్రజలు అంత అవివేకులా?

November 03, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నిక సమయంలో, ఫలితాలు వెలువడిన తరువాత కూడా టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నేతలు పరస్పరం కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు చేసుకొంటున్నారు. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను ఓడించేందుకు బద్ద శత్రువులైన కాంగ్రెస్‌, బిజెపిలు కుమ్మక్కయాయని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బిజెపి, టిఆర్ఎస్‌లు కుమ్మక్కయాయని కాంగ్రెస్‌ నేతలు వాదించారు. తనను ఓడించేందుకు సిఎం కేసీఆర్‌ అనేక కుట్రలు, కుతంత్రాలు చేశారని ఈటల రాజేందర్‌ ఆరోపించారు. అయితే ప్రజలకు ఇవన్నీ తెలియవని...అర్ధం చేసుకోలేరని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారా?ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ఎవరు ఏవిదంగా కుట్రలు చేస్తున్నారో తెలియకుండానే హుజూరాబాద్‌ ఓటర్లు ఇంత అనూహ్యమైన తీర్పు ఇచ్చారా?అంటే కాదనే అర్ధం అవుతుంది. నేతలు చాలా తెలివిగా మాట్లాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ఎంతగా ప్రయత్నించినా, ఎన్నివిదాలుగా ఎంత ఒత్తిళ్ళు తెచ్చినా లొంగకుండా హుజూరాబాద్‌ ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించారని స్పష్టం అవుతోంది.           

ప్రజల తెలివితేటలను, విజ్ఞతను తక్కువగా అంచనా వేస్తుండటం వలననే రాజకీయ నేతలు ఈవిదంగా మాట్లాడుతున్నారని చెప్పక తప్పదు. ప్రజలను తప్పు దోవ పట్టించి తమకు అనుకూలంగా తిప్పుకొనేందుకే ఇటువంటి మాటలు మాట్లాడితే ఏమవుతుందో అందరూ చూశారు. కనుక ఇకనైనా పార్టీలు వాటి నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకొంటే వారికే మంచిది.  



Related Post