బిజెపి నేతలకు కూడా అదే వర్తిస్తుంది

November 03, 2021


img

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబురాలు జరుపుకొంటున్నాయి. ఈటల రాజేందర్‌, బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్ వంటి నేతలు ఉత్సాహంగా మీడియా ముందుకు వచ్చి తమ గెలుపు, టిఆర్ఎస్‌ ఓటమి గురించి మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్‌ ఓటమి సిఎం కేసీఆర్‌కు చెంపదెబ్బ వంటిదని, దీంతో టిఆర్ఎస్‌ పతనం ప్రారంభమైనట్లే అని చెపుతున్నారు. ఇది సిఎం కేసీఆర్‌ అహంకారానికి, నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని చెపుతున్నారు. సిఎం కేసీఆర్‌ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఎంత డబ్బు వెదజల్లినా ప్రజలు తిప్పి కొట్టారని చెపుతున్నారు. 

ఇది కేసీఆర్‌ తీరుకు, పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని బిజెపి నేతలు చెపుతున్నప్పుడు, ఇప్పుడు వారు కూడా ఈవిదంగా మాట్లాడకూడదని గ్రహించాలి. రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కించపరిచేవిదంగా మాట్లాడటం తప్పని గ్రహించాలి లేకుంటే భవిష్యత్‌లో వారికీ ఇటువంటి చేదు అనుభవమే తప్పక ఎదురవుతుందని గ్రహించాలి. తమ విజయాన్ని ఆస్వాదించడం పండుగ చేసుకోవడం మంచిదే కానీ ఓడిపోయినవారిని కించపరచాలనుకోవడం సబబు కాదు. టిఆర్ఎస్‌ ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నప్పుడు, బిజెపి నేతలు కూడా తమ విజయాన్ని వినమ్రంగా స్వీకరించాలి తప్ప మిడిసిపడటం ఏమాత్రం మంచిది కాదు.



Related Post