హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బిజెపిలు కుమ్మక్కు: హరీష్‌

November 03, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓటమిపై ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్ మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ, “ఈ ఒక్క ఓటమితో టిఆర్ఎస్‌ క్రుంగిపోదు... గెలిచినప్పుడు పొంగిపోలేదు. టిఆర్ఎస్‌ ఓడినా, గెలిచినా ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్నే ఉంటుంది. ఈ ఉపఎన్నికలో ప్రజా తీర్పును శిరసావహిస్తాము. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోయినా ఓట్లేమీ తగ్గలేదు. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌కు ఓట్లేసిన హుజూరాబాద్‌ ప్రజలందరికీ కృతజ్ఞతలు. అలాగే పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. జాతీయ స్థాయిలో పోరాడుకొనే కాంగ్రెస్‌, బిజెపిలు ఈ ఉపఎన్నికలో కుమ్మకై పనిచేశాయి. ప్రజలందరూ కూడా వాటిని గమనిస్తూనే ఉన్నారు,” అని అన్నారు. 

ఓటమి తరువాత ఏ పార్టీ నేతలైనా ఈవిదంగానే స్పందిస్తారు. అయితే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బిజెపిలు కుమ్మక్కు అయ్యాయనే మంత్రి హరీష్‌రావు ఆరోపణ అదనపు మాట. టిఆర్ఎస్‌ పార్టీలో సగం మంది కాంగ్రెస్‌, సగం మంది టిడిపికి చెందినవారునప్పుడు  ప్రత్యర్ధులు చేతులు కలిపారని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలను అడ్డు తొలగించుకోవాలని టిఆర్ఎస్‌ ప్రయత్నిస్తున్నప్పుడు వాటికి టిఆర్ఎస్‌ ఉమ్మడి శత్రువు అయ్యింది. శత్రువు యొక్క శత్రువు మిత్రుడవుతాడు కనుక తమ ఉమ్మడి శత్రువు టిఆర్ఎస్‌ను ఓడించేందుకు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బిజెపిలు చేతులు కలిపితే అది రాజకీయ నిర్ణయమే అవుతుంది తప్ప వేలెత్తి చూపలేము. ఒకవేళ చూపాలంటే, సిఎం కేసీఆర్‌ ఓవైపు ఓవైసీలతో మరోవైపు నరేంద్రమోడీతో స్నేహం కొనసాగిస్తుండటం గురించి కూడా చెప్పుకోవలసి ఉంటుంది. పార్టీలు తమ రాజకీయ అవసరాలు, పార్టీ ప్రయోజనాల కోసం కొన్నిసార్లు ఇటువంటివి తప్పవు. పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు ఈటల రాజేందర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారంటూ టిఆర్ఎస్‌ ప్రచారం చేసి దెబ్బ తీయాలని చూసింది. ప్రతీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఇటువంటి ప్రత్యేకమైన వ్యూహాలతో ప్రతిపక్షాలను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తునప్పుడు ప్రతిపక్షాలు చేతులు ముడుచుకొని కూర్చోంటాయని ఆశించలేము కదా?


Related Post