అవును ఈటలది ఘన విజయమే

November 02, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్‌ 23,855 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 22 రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఈటల రాజేందర్‌కు 1,06,780 ఓట్లు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,712, కాంగ్రెస్‌ అభ్యర్ధి బల్మూరి వెంకట్‌కు కేవలం 3,012 ఓట్లు పడ్డాయి. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, బిజెపిలు సర్వశక్తులు ఒడ్డి చాలా హోరాహోరీగా పోరాడినందున, ఏ పార్టీ గెలిచినా చాలా స్వల్ప మెజార్టీతో గెలుస్తుందని అందరూ భావించారు. కానీ హుజూరాబాద్‌ ప్రజలు అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈటల రాజేందర్‌ను23,855 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు.    

ఈ ఉపఎన్నికలో అత్యంత శక్తివంతమైన టిఆర్ఎస్‌ ధాటిని తట్టుకొంటూ చివరివరకు నిబ్బరంగా పోరాడి గెలవడమే కాకుండా ఇంత భారీ మెజార్టీతో గెలిచినందున ఇది నిజంగా ఘన విజయమే అని చెప్పవచ్చు. ఈ క్రెడిట్ పూర్తిగా ఈటలకు ఆయన వెన్నంటి నిలిచిన బిజెపి శ్రేణులకు దక్కుతుంది. తాను హుజూరాబాద్‌ ప్రజల గుండెల్లో ఉన్నానని ఈటల రాజేందర్‌ పదేపదే చెప్పిన మాట నిజమని ప్రజలు కూడా నిరూపించారు. హుజూరాబాద్‌ ప్రజలు కూడా టిఆర్ఎస్‌ ఎన్ని పధకాలు, వరాలు ప్రకటించినా, ఆఘమేఘాలతో పెండింగ్ పనులను పూర్తి చేయించినా, నియోజకవర్గంలో నేతలకు పదవులు కట్టబెట్టినా, కులాలవారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి నచ్చజెప్పినా, ప్రతీ రెండిళ్ళకు ఓ కార్యకర్తను నియమించినా, చివరికి...ఒక్కో దళిత కుటుంబానికి పదేసి లక్షలు చొప్పున ఇచ్చేందుకు సిద్దపడినా ఈటల రాజేందర్‌ వైపే మొగ్గు చూపడం విశేషం. 

ఈ ఓటమితో టిఆర్ఎస్‌కు ఏమీ ‘ఫరక్’ పడదనే వాదన నిజమే కావచ్చు. కానీ ఈ ఉపఎన్నికను సిఎం కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మద్య జరిగిన యుద్ధంగా టిఆర్ఎస్‌ మార్చేసినందున ఇది సిఎం కేసీఆర్‌ ఓటమిగానే భావించక తప్పదు. ఇది టిఆర్ఎస్‌ స్వయంకృతాపరాధమే అని చెప్పక తప్పదు. ఒక సాధారణ ఉపఎన్నికకు ఇంత ప్రాధాన్యం ఇచ్చి, ఇంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలను మోహరించడం వలననే ఈ ఓటమి భూతద్దంలో నుంచి చూసినట్లుగా మరింత పెద్దదిగా కనబడుతోంది. ఈటల రాజేందర్‌పై రాజకీయ ప్రతీకారం కోసం అనవసరమైన యుద్ధాన్ని చేసి టిఆర్ఎస్‌ చేజేతులా ఈ పరాభవాన్ని కొని తెచ్చుకొందని చెప్పక తప్పదు. టిఆర్ఎస్‌కు ఎదురు లేదు...తిరుగేలేదనే భ్రమను ఈటల రాజేందర్‌ ఈ ఉపఎన్నికతో పటాపంచలు చేశారని చెప్పవచ్చు. కనుక టిఆర్ఎస్‌ ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిదేమో?


Related Post