ఏపీలో అరాచకం...తెలంగాణలో అభివృద్ధి

October 25, 2021


img

ఈరోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పూర్తి భిన్నమైన పరిణామాలు జరగడం విశేషం. హైదరాబాద్‌లో జరుగుతున్న టిఆర్ఎస్‌ ప్లీనరీ సభలో సిఎం కేసీఆర్‌, ఆ పార్టీ నేతలు ఈ ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి సాధించి దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉందో వివరిస్తుంటే, ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఏపీలో పరిస్థితులు ఏవిదంగా దిగజారిపోయాయో ఢిల్లీలో మీడియాకు వివరిస్తుండటం విశేషం. 

ఇటీవల అధికార వైసీపీ, టిడిపిల మద్య మొదలైన రాజకీయ ఆధిపత్యపోరులో భౌతిక దాడులు, దీక్షలు, ధర్నాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అట్టుడికిపోయింది. టిడిపి కార్యాలయంపై వైసీపీ దాడులను ఖండిస్తూ నిరాహార దీక్ష కూడా చేశారు. కానీ వైసీపీ తీరు మారకపోవడంతో ఈరోజు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అపాయింట్మెంట్ తీసుకొని, ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, అధికార వైసీపీ, పోలీసులు కలిసి రాజకీయ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయని, కనుక ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు వినతి పత్రం ఇచ్చి వచ్చారు.

అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో నెంబర్ వన్‌గా ఉండేది కానీ ఇప్పుడు దేశంలో గంజాయి ఉత్పత్తి, సరఫరాలో నెంబర్ వన్‌గా నిలుస్తోంది. గంజాయికి ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్య నిషేధం అంటూ మద్యం ధరలు పెంచేసి, మద్యం వ్యాపారాలు చేస్తున్న తమ పార్టీ నేతలకు చాలా మేలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా, రాజకీయ మాఫియా ఇలా చాలా మాఫియా రాజ్యాలు సమాంతరంగా నడుస్తున్నాయి. ఏపీలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ అవలక్షణాలు ఇతర రాష్ట్రాలకు కూడా పాకే ప్రమాదం ఉంది. కనుక ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశాము. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయి ఏడేళ్ళయ్యింది. ఈ ఏడేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ ఒక రాజకీయ ప్రయోగశాలగా మారిపోయింది. అధికారం చేజిక్కించుకొన్న టిడిపి, వైసీపిలు ప్రజల ఆకాంక్షలు, తమ లక్ష్యాలను మరిచి రాజకీయాలలో మునిగితేలుతున్నాయి. ఏపీ ప్రజలు రెండు పార్టీల తీరుతెన్నులను చూశారు గనుక వచ్చే శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీని ఎన్నుకొంటారో చూడాలి.


Related Post