ప్రజలు, పార్టీ, ప్రభుత్వం...ఒకే నాయకుడు! దటీజ్ సిఎం కేసీఆర్‌

October 25, 2021


img

సోమవారం ఉదయం హైటెక్స్ వద్ద మొదలైన టిఆర్ఎస్‌ ప్లీనరీ సభలో టిఆర్ఎస్‌ అధ్యక్షుడిగా సిఎం కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ 18 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీలో మరెవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు టిఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీనరీ వేదికపై ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

2001, ఏప్రిల్ 27వ తేదీన జలదృశ్యం ఆశ్రమంలో కేసీఆర్‌ టిఆర్ఎస్‌ పార్టీని స్థాపించి తొలిసారిగా గులాబీ జండా ఎగురవేశారు. కేసీఆర్‌ ఒక్కరితో మొదలైన ఆ ప్రస్థానంలో ఇప్పుడు ఆయన వెంట సుమారు 75 లక్షల మంది సుశిక్షితులైన సైనికుల వంటి నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఆయన నాయకత్వం పట్ల అచంచలమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నామని మరోసారి కేసీఆర్‌ను టిఆర్ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ద్వారా నిరూపించారు. 

టిఆర్ఎస్‌ మంత్రులు, నేతలు, కార్యకర్తలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ శాతం ప్రజలు కూడా ఆయన నాయకత్వాన్నే కోరుకొంటుండటం విశేషం. సిఎం కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీలతో ఎంత కర్కశంగా ఉన్నప్పటికీ అదంతా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి వారి వలన ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశ్యంతోనే అని, ప్రజలు కూడా భావిస్తున్నందునే ఇది సాధ్యమైందని చెప్పవచ్చు. 

ఏడు దశాబ్ధాలుగా తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురయ్యి అన్ని విధాలా ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకొన్న తెలంగాణ ప్రాంతాన్ని, దానిలో ఎనలేని వనరులను, ప్రజలను, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకొనేందుకు ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్ర సాధనే అని గట్టిగా నమ్మిన టిఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, 2001లో టిఆర్ఎస్‌ను స్థాపించి అప్పటి నుంచి 2014వరకు అందరినీ కలుపుకొనిపోతూ అనేక రకాలుగా పోరాటాలు చేసి చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించారని అందరికీ తెలుసు. 

తెలంగాణ రాష్ట్ర సాధన ఒక ఎత్తైతే, అన్ని విధాలా వెనుకబడి సకల సమస్యలతో కునారిల్లుతున్న రాష్ట్రాన్ని గాడిన పెట్టుకొని అభివృద్ధి పదంలో నడిపించడానికి కూడా సిఎం కేసీఆర్‌ అంతే పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ ప్రయత్నంలో ఎన్ని అవరోధాలు, సమస్యలు, ఆటుపోట్లు ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకే సాగారు. ఇందుకోసం సిఎం కేసీఆర్‌ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టక తప్పలేదు. అంతవరకు ఉద్యమపార్టీగా ఉన్న టిఆర్ఎస్‌ను ఫక్తు రాజకీయ పార్టీగా మలిచి, బంగారి తెలంగాణ సాధన కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, నేతలను నయన్నో, భయన్నో టిఆర్ఎస్‌లోకి రప్పించుకొన్నారు. అందుకు సిఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలకు గురయ్యారు. అయినా ఏ మాత్రం చలించలేదు. ఆయన తన లక్ష్య సాధన కోసం దేనికైనా సిద్దం... దేనినైనా భరించడానికి సిద్దం అన్నట్లు వ్యవహరిస్తూ కేవలం ఏడేళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపి, అనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలుచేస్తూ తానే కాక తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దేశానికే ఆదర్శంగా నిలిపారు.

ప్రజలెప్పుడూ ఇటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనే కోరుకొంటారు కనుక తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ రాజకీయ వ్యూహాలను, ప్రతిపక్షాల పట్ల ఆయన వ్యవహార శైలిని పెద్దగా పట్టించుకోలేదని చెప్పవచ్చు. ఈవిదంగా ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తుండటంతో కేసీఆర్‌ అటు ముఖ్యమంత్రిగా, ఇటు పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని, పార్టీని, రాష్ట్రాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించగలుగుతున్నారు. 

ఇంతమంది హృదయాలను గెలుచుకొని ఇంతకాలం (2001-2021) గడిచినా వారి నమ్మకాన్ని, ఆదరణను పొందగలుగుతుండటం చాలా గొప్ప విశేషమే కదా?నమ్మకం, చిత్తశుద్ధి, పట్టుదల, తపన వంటి లక్షణాలు ఉంటే ఏదైనా సాధ్యమే అని సిఎం కేసీఆర్‌ మరోసారి నిరూపించారు. టిఆర్ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ శుభ సందర్భంలో మైతెలంగాణ. కామ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 


Related Post