బాబు వలన కాదు..కేసీఆర్‌ వల్లనే ఈ పదవి వచ్చింది: రేవంత్‌ రెడ్డి

October 25, 2021


img

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆదివారం రాత్రి ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ప్రసారమైన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కే’ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఆయనను చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు వేయగా, రేవంత్‌ రెడ్డి తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు... 

ప్రశ్న: కాంగ్రెస్‌లో హేమాహేమీలు అనేకమంది ఉండగా వారినందరినీ పక్కన పెట్టి కాంగ్రెస్‌ అధిష్టానం మీకు ఈ పదవి కట్టబెట్టడం మీకు ఎలా అనిపిస్తోంది? చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ అధిష్టానంతో పైరవీలు చేసి మీకు ఈ పదవి ఇప్పించారని టిఆర్ఎస్‌ నేతలు అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి?      

రేవంత్‌ జవాబు: ఈవిషయంలో రాహుల్ గాంధీ చాలా చొరవ తీసుకొని సోనియా గాంధీని ఒప్పించి నాకు ఈ పదవి ఇప్పించారు. అవసరమైతే సాంప్రదాయ పద్దతులను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక నాకు ఈ పదవి రావడానికి చంద్రబాబునాయుడు కాదు సిఎం కేసీఆర్‌ కారణం! ఆయన నన్ను వెంటాడి, వేధించి, జైలుకి పంపించి నన్ను చాలా రెచ్చగొట్టారు. ఆ కారణంగా నేను ఆయనను గట్టిగా ఎదుర్కొని పోరాడాను. ఇదే..మా పార్టీ అధిష్టానానికి నాపై నమ్మకం కలిగేలా చేసింది. పిసిసి అధ్యక్ష పదవికి నేను ప్రయత్నించింది చాలా తక్కువ. కేసీఆర్‌ నిర్వాకం వలననే నాకు ఈ పదవి దక్కిందని భావిస్తున్నాను. అందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోను గానీ నన్ను ఈ స్థాయికి చేర్చినందుకు ఆయన ప్రతీరోజూ బాధపడుతుంటారని చెప్పగలను,” అని అన్నారు. 

ప్రశ్న: పార్టీ పగ్గాలు చేపట్టగానే కోవర్టులు అందరూ పార్టీ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించే అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? 

రేవంత్‌ జవాబు: పార్టీలో చాలామంది కేసీఆర్‌ తీరును సహించలేకో, భయపడో పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేసీఆర్‌తో పోరాటం అంటే చాలా ధైర్యసాహసాలు ఉండాలి. ఏమాత్రం భయపడినా మనుగడ సాగించలేమని స్పష్టం అయ్యింది. కనుక మన పోరాటం ఆ స్థాయిలోనే ఉండాలంటే ముందుగా పార్టీని ప్రక్షాళన చేసుకోక తప్పదు. అందుకే కేసీఆర్‌ను ఎదిరించలేనివారిని...ఆయనకు లొంగిపోవాలనుకొంటున్నవారినీ కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళిపోమని కోరాల్సి వచ్చింది,” అని అన్నారు. 

ప్రశ్న: మీ జీవితాశయం తెలంగాణ సిఎం కావడమే కదా? 

రేవంత్‌ జవాబు: (ఈ ప్రశ్నకు రేవంత్‌ రెడ్డి నవ్వుతూ సమాధానం దాటవేశారు.) నా జీవితాశయం కేసీఆర్‌ను గద్దె దించి అడవులకు పంపించడమే. ఈ క్షణంలో ఎన్నికలు పెడితే ఆయనను ఓడించి అడవులకు పంపించాలన్నంత కసిగా ఉన్నాను. వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఓటమి...కేసీఆర్‌ గద్దె దిగిపోవడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కూడా తధ్యం. అప్పుడు కేసీఆర్‌ ప్రతీరోజు కుమిలిపోక తప్పదు,” అని తన ప్రతీకారేచ్చను స్పష్టంగా బయటపెట్టారు.

(ఫోటో, సమాచారం ఏబీఎన్ సౌజన్యంతో...) 


Related Post