హుజూరాబాద్‌లో పరాకాష్టకు చేరిన దిగజారుడు రాజకీయాలు

October 23, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉన్నందున టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల నేతలు చాలా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు మూడు పార్టీల నేతలు హుందాతనం, నైతిక విలువలు అన్నీ పక్కన పెట్టి పరస్పరం బురద జల్లుకొంటున్నారు. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నిక గురించి వ్రాయాలంటే ఎవరు ఎవరిని ఏవిదంగా తిట్టుకొంటున్నారు?అని మాత్రమే వ్రాయాల్సివస్తోంది. 

మొదట టిఆర్ఎస్‌ నేతలు, ఈటల రాజేందర్‌ పోటాపోటీగా నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలను పంచుకోవడంలో కొన్ని రోజులు గడిచిపోయాయి. హుజూరాబాద్‌ ఉపఎన్నిక హడావుడి మొదలైన కొత్తలో నియోజకవర్గంలోని సమస్యల గురించి మాట్లాడారు. దళిత బంధుతో అవన్నీ కొట్టుకుపోయి దాంతోనే కొన్ని రోజులు గడిచిపోయింది. ఇప్పుడు అదికూడా పక్కకుపోయి రాజకీయంగా ఒకరినొకరు దెబ్బతీసుకొనే ప్రయత్నాలలో మునిగి తేలుతున్నారు. 

ఈ ఎన్నికల తరువాత ఈటల రాజేందర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని కేటీఆర్‌ కొత్త వాదన తెరపైకి తీసుకురావడం, దళిత బంధును ఈటల రాజేందర్‌, బిజెపి నేతలు నిలిపివేయించారనే టిఆర్ఎస్‌ ఆరోపణలు, ఉపఎన్నిక తరువాత దళిత బంధు పధకాన్ని టిఆర్ఎస్‌ ప్రభుత్వం నిలిపివేస్తుందని కాంగ్రెస్‌, బిజెపిలు వాదిస్తుండటం వంటివి ఒకరినొకరు దెబ్బ తీసుకొని పైచేయి సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలుగానే చెప్పవచ్చు. 

అయితే ఎదుటవాడిపై ఎంత బురద జల్లితే తమపై కూడా అంతే పడుతుందని గ్రహించకుండా మూడు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకొంటూ రాజకీయాలను పూర్తిగా దిగజార్చారని చెప్పక తప్పదు. దీనికి తామే మూల్యం చెల్లిస్తున్నామని ఎవరూ భావించకపోవడమే విశేషం.


Related Post