ఈటల టిఆర్ఎస్‌కు వెన్నుపోటు పొడిచారా?

October 23, 2021


img

ఈటల రాజేందర్‌ను ఆదరించి మంత్రి పదవులు ఇస్తే ఆయన సిఎం కేసీఆర్‌కు, పార్టీకి వెన్నుపోటు పొడిచారని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఈటలకు సిఎం కేసీఆర్‌ వల్లనే ఈ స్థాయికి ఎదిగి ఇంత గుర్తింపు, అంగబలం, ఆర్ధికబలం సంపాదించుకొన్నారనే దానిలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఆయన టిఆర్ఎస్‌ను మోసం చేసి వెళ్లిపోయారనే వాదన సరికాదనే చెప్పాలి. సిఎం కేసీఆర్‌ ఆయనను ప్రభుత్వం నుంచి తొలగించడం వలననే బయటకు వచ్చారు తప్ప లేకుంటే నేటికీ టిఆర్ఎస్‌ ప్రభుత్వంలోనే ఉంటూ సిఎం కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడుతూనే ఉండేవారని అందరికీ తెలుసు. 

ఆయనను ఏ కారణాల చేత బయటకు పంపినప్పటికీ ఆయన తన రాజకీయ మనుగడ కోసం ఏదో పార్టీలో  చేరక తప్పదు కనుక చేరారని అందరికీ తెలుసు. అది నేరం కాదు కానీ నేరమని కేటీఆర్‌ తదితరులు వాదిస్తున్నారు. ఒకవేళ ఈటల బిజెపి కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరినా టిఆర్ఎస్‌ నేతలు తప్పు పట్టకుండా ఉండరు. ఆయన తన వైఖరికి భిన్నమైన బిజెపిలో చేరారని, నల్ల చట్టాలను తెచ్చిన కేంద్రప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. ఇంతకాలం ఆయన టిఆర్ఎస్‌లో ఉన్నప్పుడు సిఎం కేసీఆర్‌ను, తమ ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలను గట్టిగా సమర్ధించుకొన్నట్లే ఇప్పుడు బిజెపిలో ఉన్నారు కనుక కేంద్రప్రభుత్వాన్ని సమర్ధించుకోక తప్పదు. ఇది చాలా సహజం. 

ఇక ఏడేళ్ళు మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని మంత్రి హరీష్‌రావు వాదిస్తున్నారు. ఒక మంత్రి ఏడేళ్ళుగా తన జిల్లాను, నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసి ఉన్నప్పుడు ఎందుకు ఉపేక్షించారు? టిఆర్ఎస్‌ ఎమ్మేల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ వారికి ర్యాంకులు ఇస్తూ, పనితీరు బాగోనివారిని మందలిస్తూ, పనితీరు మెరుగు పరుచుకోకపోతే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వకుండా పక్కన పెడతామని సిఎం కేసీఆర్‌ హెచ్చరిస్తుంటారు. కానీ ఈటలకు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి రెండుసార్లు కీలకమైన మంత్రి పదవులు కూడా ఇచ్చారంటే ఆయన పనితీరు అద్భుతంగా ఉందనే కదా అర్ధం? ఆయన భూకబ్జాలకు పాల్పడుతూ అవినీతిలో మునిగి తేలుతున్నాడని తెలిసి ఉన్నప్పుడు ఆయనపై చర్యలు తీసుకోకుండా సిఎం కేసీఆర్‌ ఇంతకాలం ఎందుకు ఉపేక్షించారు?గత ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యపై అవినీతి ఆరోపణలు రాగానే వెంటనే పదవిలో తొలగించినట్లుగా ఈటలను కూడా అప్పుడే తొలగించవచ్చు కదా? కానీ ఏడేళ్ళు ఎందుకు ఆగారు? అని లోతుగా ఆలోచిస్తే ఇటువంటి అనేక ప్రశ్నలకు టిఆర్ఎస్‌ పార్టీయే సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. 


Related Post