కాంగ్రెస్‌, బిజెపిలపై కేటీఆర్‌ అసహనం...ఏల?

October 23, 2021


img

బంతిని గోడకేసి ఎంత గట్టిగా కొడితే అది అంతే వేగంగా తిరిగివస్తుంది. రాజకీయాలలో కూడా అంతే! అధికార పార్టీ నేతలు ఒక మెట్టు దిగి ప్రతిపక్షాలను నిందిస్తే, ప్రతిపక్షాలు రెండు మెట్లు దిగి జవాబు చెపుతాయి. అధికార పార్టీ రాజకీయాలలో నైతిక విలువలను పక్కన పెడితే ప్రతిపక్షాలు కూడా పక్కన పెడతాయి. యధారాజా తధాప్రజా అన్నట్లు అధికార పార్టీని బట్టే ప్రతిపక్ష పార్టీల తీరు కూడా ఉంటుందని చెప్పవచ్చు. కనుక ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి నేతలు చెలరేగిపోయి సిఎం కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటే అందుకు టిఆర్ఎస్‌ బాధ్యత కూడా ఉంది. 

సిఎం కేసీఆర్‌ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు ప్రతిపక్ష నేతలను సన్నాసులు, దద్దమ్మలు, రాక్షసులు, అవినీతిపరులు అంటూ నిందిస్తున్నప్పుడు వారు మడి కట్టుకొని కూర్చోవాలని ఆశించడం అత్యాశే అవుతుంది. కనుక వారు కూడా మరో రెండు మెట్లు దిగి టిఆర్ఎస్‌ నేతలకు ఇంకా ఘాటుగా జవాబిస్తున్నారు. 

ఒకవేళ టిఆర్ఎస్‌ నేతలు హుందాగా వ్యవహరిస్తున్నా ప్రతిపక్ష నేతలు ఈవిదంగా మాట్లాడితే అప్పుడు వారిని వేలెత్తి చూపడానికి టిఆర్ఎస్‌కు హక్కు ఉంటుంది. కానీ టిఆర్ఎస్‌ క్రమంగా మెట్లు దిగుతోంది కనుక ప్రతిపక్షాల మాటలకు బాధపడి ప్రయోజనం లేదు. తమ పట్ల టిఆర్ఎస్‌ ఏవిధంగా వ్యవహరిస్తోందో అవి కూడా దాంతో అదేవిదంగా వ్యవహరిస్తున్నాయని చెప్పవచ్చు. కనుక వాటి తీరుపై పదేపదే అసహనం వ్యక్తం చేయడం కంటే టిఆర్ఎస్‌ రాజకీయాలలో హుందాతనం పాటించడం వలన ఈ రాజకీయ వాతావరణంలో తప్పక మార్పు కలిగే అవకాశం ఉంటుంది.


Related Post