ఆ పాపం టిఆర్ఎస్‌ ప్రభుత్వానిదే: బండి సంజయ్‌

October 23, 2021


img

దేశంలో నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకొంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. వాటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు తగ్గుతాయనుకొంటే, రాష్ట్రాలు అంగీకరించడం లేదంటూ కేంద్రం తప్పించుకొంటోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పాపం కేంద్రప్రభుత్వానిదే అంటూ రాష్ట్రాలు తప్పించుకొంటున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న ఈ డ్రామాలకు సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న రాజకీయ పార్టీల నేతలు ఇంకా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

శుక్రవారం రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కమాలాపూర్, శనిగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. “తెలంగాణ ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.41 పన్ను వసూలు చేసుకొంటూ ప్రజలను దోచుకొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ పన్నును వదులుకొంటే లీటరు పెట్రోల్ రూ.60 కే ఇవ్వవచ్చు,” అని అన్నారు. 

ఒకవేళ కేంద్రప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని అమలుచేయాలనుకొంటే దానిని రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోలేవు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ చార్జీల పెంపు వంటివి ఇందుకు  ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కనుక కేంద్రం తలుచుకొంటే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాగలదు. కానీ వాటిపై కేంద్రప్రభుత్వానికి కూడా భారీగా పన్ను రూపంలో ఆదాయం వస్తోంది కనుక దానిని వదులుకోలేక రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తూ తప్పించుకొంటోంది. 

ఏదైనా రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడో లేదా లోక్‌సభ ఎన్నికలప్పుడో పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగితే ప్రజాగ్రహానికి గురవుతామనే భయంతో కేంద్రప్రభుత్వం వాటికి తాత్కాలికంగా కళ్ళెం వేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే కేంద్రప్రభుత్వం తలుచుకొంటే పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయగలదని స్పష్టం అవుతోంది. కానీ ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు కనుక ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడంలేదనుకోవాల్సి ఉంటుంది.



Related Post