అభివృద్ధి మరిచి రాజకీయాలలో మునిగిపోయిన ఏపీ

October 22, 2021


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తరువాత సిఎంలుగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు, కేసీఆర్‌ తమతమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని పోటీ పడ్డారు. నేటికీ కేసీఆర్‌ తన లక్ష్యాన్ని మరిచిపోకుండా అదే దిశలో అదే బలమైన సంకల్పంతో ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. కానీ మూడేళ్ళు తిరిగేసరికి చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వ లక్ష్యాన్ని పక్కన పెట్టి, , ప్రజల ఆకాంక్షలను మరిచి ఇటు తెలంగాణ ప్రభుత్వంతో అటు కేంద్రప్రభుత్వంతో నిత్యం గొడవలు పెట్టుకొంటూ కాలక్షేపం చేసి అందరి ఆగ్రహానికి గురయ్యి శాసనసభ ఎన్నికలలో భారీ మూల్యం చెల్లించారు.  

తరువాత ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి కూడా తన ప్రభుత్వం ముందున్న భారీ లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలను గుర్తించకుండా తెలుగుదేశం పార్టీపై రాజకీయ ప్రతీకారాలు తీర్చుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడున్నరేళ్ళు గడిచినా ఇంతవరకు పూర్తి స్థాయి రాజధాని లేదు. ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికీ తెలీని పరిస్థితి. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పేరుకుపోయుంటే వాటి పరిష్కరించకుండా టిడిపితో రాజకీయ యుద్ధాలు చేస్తూ జగన్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది. తాజాగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల నేతలు పోటాపోటీగా ధర్నాలు, దీక్షలు చేస్తుంటే వారిని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి ఏడున్నరేళ్ళు గడుస్తున్నా అభివృద్ధి ఊసే లేదు. ఎప్పుడూ రాజకీయాలేనా? అని సామాన్య ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు. 


Related Post