హుజూరాబాద్‌ గెలుపోటములు ఏ పార్టీపై ఏవిదంగా?

October 22, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికను సిఎం కేసీఆర్‌, ఈటల రాజేందర్‌కు మద్య జరుగుతున్న యుద్ధంగా చెప్పవచ్చు. తనను అత్యంత అవమానకరంగా మంత్రి పదవి నుంచి తొలగించి అవినీతిపరుడనే ముద్ర వేసినందుకు ఈటల రాజేందర్‌ సిఎం కేసీఆర్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. 

తనను, తన ప్రభుత్వాన్ని, తన పాలనను, తన పార్టీని ఈటల రాజేందర్‌ తీవ్రంగా విమర్శిస్తూ, తీవ్ర ఆరోపణలు చేస్తూ అప్రదిష్టపాలు చేస్తున్నందుకుగాను ఎట్టి పరిస్థితులలో ఆయనను ఓడించాలని సిఎం కేసీఆర్‌ చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక ఈ ఉపఎన్నిక వారిరువురి మద్యే జరుగుతున్నట్లు భావించవచ్చు. కనుక ఈ ఉపఎన్నికలో గెలుపోటములకు కూడా వారిరువురిదే పూర్తి బాధ్యత అని చెప్పక తప్పదు. 

ఒకవేళ ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ ఓడిపోయినట్లయితే, ఆయన రాజకీయ జీవితంలో ఇదొక పెద్ద ఎదురుదెబ్బగా నిలుస్తుంది. హుజూరాబాద్‌ టిఆర్ఎస్‌ చేతిలోకి వెళ్లిపోతే ఈటల నియోజకవర్గంపై పట్టుకోల్పోతారు. ఆయన సిఎం కేసీఆర్‌ను ఎదుర్కోగల మంచి సమర్ధుడనే నమ్మకంతోనే ఆయనను బిజెపిలోకి తీసుకొంది. కానీ ఈ ఉపఎన్నికలో ఓడిపోతే బిజెపిలో ఆయన విలువ తగ్గుతుంది. అప్పుడు మంత్రి హరీష్‌రావు చెప్పినట్లు ఈటల కాంగ్రెస్ పార్టీవైపు చూసినా ఆశ్చర్యం లేదు. ఈ ఉపఎన్నికలో ఈటల ఓడిపోతే అసైన్డ్ భూముల కేసులలో మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగవలసి రావచ్చు. అప్పుడు టిఆర్ఎస్‌ చేసే విమర్శలు, ఆరోపణలను భరించడం ఈటలకు చాలా కష్టం అవుతుంది. అందుకే ఈటల రాజేందర్‌ తన సర్వశక్తులు, శక్తియుక్తులు ఒడ్డి ఈ ఉపఎన్నికలో గెలిచేందుకు కృషి చేస్తున్నారు. 

ఒకవేళ ఈ ఉపఎన్నికలో ఈటల చేతిలో టిఆర్ఎస్‌ ఓడిపోతే అది కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావుల ఓటమిగానే భావించవలసి ఉంటుంది. ఇప్పటికే ఈటల వ్యవహారం...ఈ ఉపఎన్నికతో టిఆర్ఎస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. కనుక టిఆర్ఎస్‌లో అసంతృప్తి నేతలు గళం విప్పవచ్చు. బిజెపి నేతలు మరింత గట్టిగా సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేయవచ్చు. వారికి కాంగ్రెస్ నేతలు కూడా తోడవుతారు. అలాగే సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం, వైఎస్ షర్మిల, తీన్‌మార్ మల్లన్న, ప్రవీణ్ కుమార్‌ వంటి నేతలు కూడా సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తమ పోరాటాలు ఉదృతం చేయవచ్చు. అంటే ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోతే రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నిటినీ టిఆర్ఎస్‌ ఒక్కటే ఎదుర్కోవలసి ఉంటుందన్న మాట!    

ఒకవేళ ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ గెలిస్తే నవంబర్‌ 15న వరంగల్‌లో టిఆర్ఎస్‌ నిర్వహించబోయే విజయగర్జన సభలో నిజంగానే టిఆర్ఎస్‌ గర్జిస్తుంది. ఒకవేళ ఓడిపోతే ఆ సభను వాయిదా వేసుకోవడమో లేదా విజయ గర్జన పేరు మార్చుకొని నిర్వహించవచ్చు.


Related Post