రేవంత్‌ రెడ్డి రేపు ఎల్లుండి హుజూరాబాద్‌లో ప్రచారం

October 22, 2021


img

ఈనెల 30న హుజూరాబాద్‌ ఉపఎన్నిక జరుగబోతోంది. టిఆర్ఎస్, బిజెపిలు హుజూరాబాద్‌లో గత రెండు మూడు నెలలుగా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బల్మూరి వెంకట్‌ను అభ్యర్ధిగా బరిలో దింపిన తరువాత జోరుగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు వెంకట్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా ఈ శని, ఆదివారాలలో హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన సిఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావులను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించడం ఖాయం కనుక ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కడం ఖాయం. 

ఈ ఉపఎన్నికలో ప్రధానంగా టిఆర్ఎస్‌, బిజెపిలకు మద్యే పోటీ నెలకొని ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి హామీ, 65 వేల పోస్టుల భర్తీలో జాప్యం, విద్యార్దుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులో జాప్యం వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకొని టిఆర్ఎస్‌తో పోరాడుతోంది. రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కించుకోవాలని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్ విసరడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తోందికనుక ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచినా గెలవక పోయినా ఓట్లు చీల్చి టిఆర్ఎస్‌కు ఎంతో కొంత నష్టం కలిగించడం ఖాయం. టిఆర్ఎస్‌ను ఓడించేందుకు పరోక్షంగా ఈటల రాజేందర్‌కు సహకరించినా ఆశ్చర్యం లేదు. ఈ ఉపఎన్నిక పట్ల మొదట నిర్లిప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మంత్రి కేటీఆర్‌ రెచ్చగొట్టడం వలననే హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌కు ఈ కొత్త సమస్యలు ఏర్పడ్డాయని చెప్పక తప్పదు. తమకు బిజెపితోనే పోటీ తప్ప కాంగ్రెస్‌తో కాదని టిఆర్ఎస్‌ భావించినప్పుడు కాంగ్రెస్ పార్టీని కెలక్కుండా ఉండాల్సింది. కనుక నష్టం భరించక తప్పదు.


Related Post