కేసీఆర్‌పై షర్మిల ఘాటు విమర్శలు...టిఆర్ఎస్‌ మౌనం!

October 21, 2021


img

తెలంగాణ రాజకీయాలలోకి చాలా నాటకీయంగా ప్రవేశించిన వైఎస్ షర్మిల బుదవారం చేవెళ్ళ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె చేవెళ్ళలో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం కేసీఆర్‌, ఆయన పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంతగా అంటే... సిఎం కేసీఆర్‌ను నిత్యం విమర్శించే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా ఇంతవరకు ఆ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించలేదు. 

కాంగ్రెస్‌, బిజెపి నేతల విమర్శలకు ఎప్పటికప్పుడు ఘాటుగా సమాధానాలు చెప్పే టిఆర్ఎస్‌ నేతలు తమ అధినేతపై వైఎస్ షర్మిల ఇంత తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నా మౌనం వహిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సిఎం కేసీఆర్‌ను, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకే ఆమె పాదయాత్ర చేస్తున్నారని తెలిసి ఉన్నప్పటికీ టిఆర్ఎస్‌ నేతలు కిమ్మనడం లేదు. 

అలాగే కాంగ్రెస్‌, బిజెపి, టిజేఎస్‌ నేతలు ఎప్పుడైనా దీక్షలు, ర్యాలీలకు సిద్దమైతే వాటికి అనుమతి లేదంటూ అడ్డుకొని అరెస్టులు చేసే పోలీస్ శాఖ వైఎస్ షర్మిల పాదయాత్రకు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకపోవడం విశేషం. అంటే టిఆర్ఎస్‌, వైఎస్సార్‌టిపిల మద్య ఏమైనా రహస్య అవగాహన ఉందా?అందుకే టిఆర్ఎస్‌ నేతలు, పోలీస్ శాఖ ఆమెను చూసి చూడనట్లు వదిలేస్తున్నారా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ పార్టీని ఆమెతో విమర్శిస్తుంటే ప్రజలలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రగిలి తమకు ఓటు బ్యాంక్ పెరుగుతుందని టిఆర్ఎస్‌ భావిస్తోందేమో తెలీదు. కానీ ఆమె తన పాదయాత్రలో రాష్ట్రంలో కేవలం మహిళలను మాత్రమే ఆకర్షించి తనవైపు తిప్పుకోగలిగినా అప్పుడు నష్టపోయేది టిఆర్ఎస్‌ పార్టీయే కావచ్చు. 


Related Post