సమంత విషయంలో చైతు, నాగార్జునలకు బాధ్యత లేదా?

October 21, 2021


img

టాలీవుడ్‌లో చక్కటి జోడీగా ఉన్న సమంత, నాగ చైతన్యలు విడిపోయినప్పటి నుంచి సమంతకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియా, కొన్ని వెబ్‌సైట్లలో ఆమె గురించి లేనిపోనివి వ్రాస్తూ ఆమెకు మనశాంతి లేకుండా చేస్తున్నారు. దీనిపై ఆమె కూకట్‌పల్లి కోర్టులో కేసు కూడా వేసింది. 

ఒక మహిళ భర్త నుంచి విడిపోవడం అంటే ఎంత కష్టమో...ఎంత ఆవేదన భరిస్తోందో... ఆ తరువాత జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆమె తప్ప మరెవరూ ఊహించలేరు. ఇటువంటి పరిస్థితిలో ఉన్న సమంత మళ్ళీ తన జీవితాన్ని పునః ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంటే, ఆమెకు అండగా నిలబడవలసిన సమాజం కాకుల్లా పొడుస్తూ వేధిస్తుండటం చూస్తే సమాజం ఇంకా అనాగరికతలోనే ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. 

వారు ఏ కారణంతో విడిపోయినప్పటికీ అది వారి వ్యక్తిగత విషయం. వారి నిర్ణయంపై సమాజం చర్చించనవసరం లేదు. అయితే వారు సెలబ్రేటీలు కనుక సహజంగానే అందరూ ఆసక్తి చూపుతుంటారు. అందుకని సమంతకు లేనిపోనివి అంటగట్టి ఆమెనే దోషిగా సోషల్ మీడియా తీర్పు చెప్పడం చాలా తప్పు. 

ఇటువంటి సందర్భాలలో అందరూ మహిళనే నిందిస్తారు...ప్రశ్నిస్తుంటారు తప్ప పురుషులను నిందించారని సమంత చెప్పింది అక్షరాల నిజం. సమంత, నాగ చైతన్యలు విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత అందరూ సమంతనే టార్గెట్ చేస్తున్నారు తప్ప ఎవరూ నాగ చైతన్యను ప్రశ్నించడం లేదు... నిందించడం లేదు. నిజానికి ఆ అవసరం లేదు కూడా. 

కానీ నాలుగేళ్ళు ఎంతో అన్యోన్యంగా కాపురం చేసిన తన భార్య సమంతను ఇటువంటి పుకార్లతో సోషల్ మీడియా వెంటబడి వేధిస్తున్నప్పుడు వెంటనే స్పందించి, ఖండించడం నాగ చైతన్య బాధ్యత. కానీ అతను స్పందించలేదు. ఒకవేళ అతను ఏ కారణం చేతైన స్పందించలేకపోతే అతని తండ్రి నాగార్జున స్పందించి ఆ పుకార్లను కట్టడి చేసి కోడలు సమంతకు ఊరట కలిగించే ప్రయత్నం చేసి ఉంటే ఆయనకూ ఎంతో గౌరవంగా ఉండేది. కానీ నాగార్జున కూడా ఖండించలేదు. 

వారు నటించే సినిమాలలో ఎంతో ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పాత్రలు పోషిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంటారు. నిజజీవితంలో కూడా అక్కినేని కుటుంబ సభ్యులు సమాజానికి ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తుంటారు. మరి సమంత విషయంలో వారిరువురూ మౌనం వహించడం దేనికి? ఒకసారి వారిలో ఎవరో ఒకరు మీడియాతో మాట్లాడి సమంతకు ఉపశమనం కలిగించవచ్చు కదా? ఈ మాత్రం కూడా చేయకపోతే వారు జీవితంలో కూడా హుందాగా నటిస్తున్నారని సమాజం అనుకోదా?


Related Post