గాంధీలో తుప్పు పట్టిన అగ్నిమాపక సాధనాలు

October 21, 2021


img

సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రిలో బుదవారం అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణం తెలుసుకొనేందుకు పోలీసులు జరిపిన ప్రాధమిక దర్యాప్తులో చాలా దిగ్బ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి.  నిత్యం వేలాదిమందికి వైద్య చికిత్సలు అందించే గాంధీ ఆసుపత్రిలో అగ్నిమాపక సాధనాలు తుప్పు పట్టి పనికిరాని స్థితిలో ఉన్నాయి. ఆసుపత్రిలో ఎప్పుడో ఏళ్ళ క్రితం వేసిన విద్యుత్ వైర్లు కూడా పాడైపోయాయి. కొన్ని చోట్ల ఎలుకలు వాటిని కొరికివేసినట్లు గుర్తించారు. ఆ కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయని పోలీసులు గుర్తించారు. 

సాధారణంగా హాస్పిటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాలలో ఉంచే అగ్నిమాపక సాధనాలు (సిలెండర్లు)ను నిర్ధిష్ట గడువు తరువాత పరిశీలించి వాటిలో నింపిన అగ్నిమాపక రసాయనం లేదా పొడిని మార్చుతుండాలి. అప్పుడు వాటికి ‘వినియోగానికి పనికివస్తాయని’ అగ్నిమాపకశాఖ సర్టిఫికేట్ ఇస్తుంటుంది. కానీ గాంధీ ఆసుపత్రి అధికారులు, అగ్నిమాపక శాఖ కూడా పట్టించుకోలేదని ఈ ప్రమాదంతో స్పష్టం అయ్యింది. 

అలాగే ఇటువంటి అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే నీళ్ళు వెదజల్లి మంటలను ఆర్పే ఆటోమేటిక్ అగ్నిమాపక వ్యవస్థ ఇప్పుడు అన్ని చోట్ల ఏర్పాటు చేసుకొంటున్నారు. దాని కోసం గాంధీ ఆసుపత్రి అధికారులు ప్రభుత్వానికి చాలాసార్లు లేఖలు వ్రాసినప్పటికీ స్పందించలేదని ఈ ప్రమాదంతో స్పష్టం అవుతోంది. 

ఇటువంటి అత్యంత ముఖ్యమైన విషయాలలో అలసత్వం వలన అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఆసుపత్రిలో విలువైన పరికరాలు కాలి బూడిదవడమే కాక ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. నిన్న ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది కనుక ఆసుపత్రి సిబ్బంది వెంటనే రోగులను బయటకు తరలించడంతో పెను విషాదం తప్పింది అదే... ఏ అర్ధరాత్రో... తెల్లవారుజామునో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటే ఏమై ఉండేది?అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు?ఇటువంటి ఘటనలు ఆసుపత్రికి, ప్రభుత్వానికి కూడా అప్రదిష్ట కలిగిస్తాయి కదా? ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతిలో ఉంది. అయినా గాంధీ ఆసుపత్రిలో ఇటువంటి దుస్థితి నెలకొని ఉండటం చాలా శోచనీయం. 


Related Post