దళిత బంధుపై తాత్కాలిక నిషేదమే కానీ...

October 20, 2021


img

సిఎం కేసీఆర్‌ మంగళవారం యాదాద్రి పర్యటిస్తున్నప్పుడు మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా, “హుజూరాబాద్‌లో దళిత బంధు పధకం నిలిపివేసి ఎన్నికల కమీషన్‌ తన  పరిధిని అతిక్రమించిందని భావిస్తున్నాను. ఈ పధకం ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది కాదు. దీని కోసం బడ్జెట్‌లోనే నిధులు కేటాయించి వాసాలమర్రి గ్రామంలో అమలుచేశాము. తరువాత హుజూరాబాద్‌లో అమలుచేస్తుంటే ఎన్నికల కోడ్ పేరుతో నిలిపివేసింది. ఇది సరికాదు. అయితే లబ్దిదారులు దీని గురించి ఆందోళన చెందనవసరం లేదు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక పూర్తికాగానే మళ్ళీ దీనిని అమలుచేస్తాము,” అని అన్నారు. 

ఈ పధకం కోసం ముందుగానే నిధులు కేటాయించినప్పటికీ హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ముందే ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసి హడావుడిగా అమలుచేయడం మొదలుపెట్టింది. ఉపఎన్నికకు ముందు ఓటర్లుగా ఉన్న దళిత కుటుంబాలకు ఈ పధకం పేరుతో పదేసి లక్షలు పంచిపెడితే వారు తప్పక టిఆర్ఎస్‌కే ఓట్లు వేస్తారని వేరే చెప్పక్కరలేదు. దీంతో దళిత ఓటర్లు మాత్రమే కాక ఈ పధకం గురించి టిఆర్ఎస్‌ గొప్పగా చేసుకొంటున్న ప్రచారంతో ఇతర వర్గాల ప్రజలు కూడా ప్రభావితులవుతారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పధకాలను ఎరగా వేసి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినప్పుడు వాటిని అడ్డుకోవడం ఈసీ బాధ్యత. కనుకనే ఈసీ దీనిని ‘తాత్కాలికంగా మాత్రమే’ నిలిపివేసింది. కనుక ఈ విషయంలో ఈసీని తప్పు పట్టడానికి లేదు. 

అయితే దీనిని అమలుచేయకుండా అందరూ అడ్డుపడుతున్నారంటూ టిఆర్ఎస్‌ నేతలు మాట్లాడుతూ ప్రజలలో అయోమయం సృష్టిస్తున్నారని చెప్పక తప్పదు. ఈసీ నిర్ణయాన్ని కూడా అనుకూలంగా మలుచుకొని, తమకు గట్టి సవాలు విసురుతున్న బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందరే దళిత బంధును అడ్డుకొన్నారంటూ టిఆర్ఎస్‌ నేతలు ప్రచారం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

రేపు ఉపఎన్నిక ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ పధకానికి ఎటువంటి అవరోధమూ ఉండదు కనుక అప్పుడూ టిఆర్ఎస్‌ మంత్రులు, ముఖ్యంగా ఆర్ధికమంత్రి హరీష్‌రావు ఇంతే గట్టిగా ఈ పధకం గురించి మాట్లాడుతూ దీని అమలు కోసం తమ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయగలరా?ఒకవేళ తమ ప్రభుత్వం ఈ పధకాన్ని ఏదో సాకుతో అటకెక్కిస్తే అప్పుడు ఆయన, టిఆర్ఎస్‌ నేతలు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఏమని సమాధానం చెపుతారు? 


Related Post