వచ్చే ఎన్నికలలో 25 సీట్లకు పోటీ చేస్తాం: సిపిఐ

October 20, 2021


img

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలంలో కొత్తపల్లిలో మంగళవారం మానకొండూర్ నియోజకవర్గం సిపిఐ స్థాయి సమావేశం జరిగింది. దానిలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “వచ్చే శాసనసభ ఎన్నికలలో 25 సీట్లలో మనం పోటీ చేస్తాము. వాటిని గెలుచుకొనేందుకు ఇప్పటి నుంచే మనం గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలన, విధానాలపై సిపిఐ నిరంతరం పోరాడుతూనే ఉంది. ఇక ముందు కూడా పోరాడుతూనే ఉంటుంది,” అని అన్నారు.

ఎన్నికలంటే అధికార పార్టీలకి అగ్నిపరీక్ష…ప్రతిపక్ష పార్టీలకు పండగ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరుగబోయే శాసనసభ ఎన్నికలపై అధికార ప్రతిపక్షపార్టీలకు చాలా అంచనాలున్నాయి. మరో 20 ఏళ్ళ వరకు తామే అధికారంలో ఉండబోతున్నామని టిఆర్ఎస్‌ బల్లగుద్ది చెపుతుంటే, కాంగ్రెస్‌, బిజెపి, బీఎస్పీ, వైఎస్సార్‌టిపి పార్టీలు వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి తామే అధికారంలోకి రాబోతున్నామని నమ్మకంగా చెపుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. 

ఇక జాతీయ పార్టీల గురించి చెప్పుకోవలసి వస్తే కాంగ్రెస్‌, బిజెపిలను చెప్పుకొంటున్నారు తప్ప సిపిఐ, సిపిఎం పార్టీలను అందరూ మరిచినట్లే ఉన్నారు. అందుకు వాటిని అవే నిందించుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు పార్టీలు దశాబ్ధాలుగా రాజకీయాలలో ఉన్నప్పటికీ రెండు మూడు రాష్ట్రాలలో తప్ప ఎక్కడా తామంతట తాముగా పోటీ చేసింది లేదు...అధికారంలోకి వచ్చిందీ లేదు. ఆ కారణంగా అవి క్రమంగా ఏదో ఓ పార్టీకి తోక పార్టీలుగా మిగిలిపోతూ తమ పోరాట స్పూర్తిని కోల్పోయి, చివరికి తమ ఉనికిని కూడా పోగొట్టుకొంటున్నాయి. ఈ కారణంగానే అవి ఇతర పార్టీలతో పొత్తులలో భాగంగా దక్కిన సీట్లను కూడా గెలుచుకోలేక చతికిలపడుతున్నాయని చెప్పక తప్పదు. 

కనుక వచ్చే ఎన్నికలలో సిపిఐ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందనేది ముఖ్యం కాదు. వాటిలో ఎన్నిటిని గెలుచుకోగలదు? అందుకోసం ఆ పార్టీ బూజు పట్టిన తన ఆలోచన ధోరణిని, తీరు తెన్నులను మార్చుకోగలదా...లేదా? అనేది ముఖ్యం. 


Related Post