హుజూరాబాద్‌లో దళిత బంధు రగడ

October 20, 2021


img

హుజూరాబాద్‌ ఉపఎన్నికల ప్రచారంలో ఇప్పుడు అధికార, ప్రతిపక్షాలు దళిత బంధు పధకంపై పరస్పరం ఆరోపణలు చేసుకొంటున్నాయి. ఈటల రాజేందర్‌, బిజెపి నేతలు ఈసీ లేఖ వ్రాసి దానిని ఆపించారని టిఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తూ నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం దళితులను ఆదుకోవాలని ప్రయత్నిస్తుంటే, ఈటల రాజేందర్‌ దానిని అడ్డుకొని వారి పొట్ట కొట్టాలని చూస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు.  

టిఆర్ఎస్‌ నేతలే ఆ లేఖ సృష్టించి ప్రజలను తనకు వ్యతిరేకంగా ఎగదోస్తున్నారని, దమ్ముంటే ఆ లేఖ నేనే వ్రాసినట్లు నిరూపించాలని ఈటల రాజేందర్‌ సవాల్ విసురుతున్నారు. సిఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉన్నట్లయితే  దళిత బంధు పధకంపై స్టే ఎత్తివేయాలని ఈసీని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. 

సిఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళితుల బ్యాంక్ ఖాతాలలో జమా చేసిన డబ్బును వారు తీసుకోకుండా ఎందుకు ఫ్రీజ్ చేయించారని బిజెపి నేత వివేక్ ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్‌లో రైతు బంధు అమలు చేస్తున్నప్పుడు దళిత బంధు పధకానికి ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందని వివేక్ ప్రశ్నించారు. 

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే వరకు ఈ పధకాన్ని సాగదీస్తే ఆ డబ్బు చెల్లించకుండా ఎగవేయాలనే సిఎం కేసీఆర్‌ ఈవిదంగా చేశారని విజయశాంతి ఆరోపించారు. సిఎం కేసీఆర్‌కు అసలు ఈ పధకం అమలుచేసే ఉద్దేశ్యమే లేదని కేవలం ఎన్నికల కోసమే దీనిని ప్రారంభించారని, దానిని కూడా టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ కుమ్మక్కై అమలుకాకుండా ఈసీకి లేఖలు వ్రాసి అడ్డుకొన్నాయని రేవంత్‌ రెడ్డి అన్నారు. రూ.3,016 నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు పదేసి లక్షలు చొప్పున పంచిపెడతానంటే ఎవరు నమ్ముతారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఉపఎన్నిక తరువాత దళిత బంధుని అటకెక్కించడం కోసమే సిఎం కేసీఆర్‌ ఈ పధకం పన్నారని ఆరోపించారు. టిఆర్ఎస్‌ అధ్యక్ష పదవికి పార్టీలో ఏ ఒక్కరూ నామినేషన్ వేసే ధైర్యం చేయలేరని, దళితుల పట్ల సిఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనీసం టిఆర్ఎస్‌ అధ్యక్ష పదవికి దళిత నేతకి అప్పగించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. 

కేసీఆర్‌కు దళితులపై ఎటువంటి ప్రేమ లేదని అందుకే పదేపదే వారికి మాయమాటలు, బూటకపు హామీలు ఇస్తూ పబ్బం గడుపుకొంటున్నారని, దళిత బంధు పధకం కూడా అటువంటిదేనని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కానీ బిజెపి దళితుడిని రాష్ట్రపతిగా చేసి గౌరవించిందని అన్నారు. కేసీఆర్‌ కూర్చోన్న సిఎం కుర్చీ నిజానికి దళితులకు చెందినదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తన చెల్లెలను నిజామాబాద్‌లో గెలిపించుకోలేకపోయిన కేటీఆర్‌, ఆమెను ఓడించినందుకు తనపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఎద్దేవా చేశారు.


Related Post