రాష్ట్రంలో అంబేడ్కర్ వారసుడు ఎవరు?

October 19, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి బడుగు బలహీనవర్గాలపై పడింది. అన్ని పార్టీలు వారిని ఆకర్షించేందుకు సభలు, సమావేశాలు, దీక్షలు, పాదయాత్రలు, పధకాలతో గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అయితే వారి అభివృద్ధి, సంక్షేమం కంటే వారిని ఆకర్షించడం ద్వారా తమ ఓటు బ్యాంకును పెంచుకొని తమ రాజకీయ ప్రత్యర్ధులపై పైచేయి సాధించాలనే తాపత్రయం, వారి ఓట్లతో అధికారం చేజిక్కించుకోవాలనే తపనే అన్ని పార్టీలలో ఎక్కువగా కనబడుతోంది. 

అంతేకాదు... దేశంలో బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం ద్వారా వెసులుబాటు కల్పించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్‌కు తామే అసలు సిసలైన వారసులమని ప్రజలలో గుర్తింపు సంపాదించుకొనేందుకు చాలా మంది నేతలు తాపత్రయపడుతున్నారు. కొందరు నాయకులు తామే డాక్టర్ అంబేడ్కర్‌ అంతటివారమని ప్రజలు భావించేలా చేసేందుకు తాపత్రయపడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. డాక్టర్ అంబేడ్కర్‌ ఆశయాలను, ఆయన చూపిన మార్గాన్ని ఏనాడూ అనుసరించనివారు కూడా తామే ఆయనకు ప్రతిరూపమని ప్రజలను నమ్మించేందుకు పోటీలు పడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

డాక్టర్ అంబేడ్కర్‌ భారీ విగ్రహాలు పెట్టించడం, వాటికి పూలమాలలు వేయడం, ఆయన ఫోటోలు వెనక పెట్టుకొని ప్రసంగాలు దంచడం వలన బడుగు బలహీనవర్గాల జీవితాలలో ఎటువంటి మార్పులు రావని అందరికీ తెలుసు. కానీ బడుగు బలహీనవర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజ్యాధికారం ఇవ్వడం కంటే ఇవే సులువు కనుక అధికార, ప్రతిపక్ష నాయకులు వీటితోనే వారిని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పక తప్పదు. 

దాదాపు అన్ని పార్టీలు...వాటి నేతలు బడుగు బలహీన వర్గాల ప్రజలను కేవలం ఓటు బ్యాంకులుగా చూస్తున్నాయి తప్ప వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న కష్టానష్టాలను చూసే ప్రయత్నం చేయడం లేదనే చెప్పాలి. తమతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నవారిని గుర్తించి గుణపాఠం చెప్పినప్పుడే వారి పట్ల రాజకీయ పార్టీల దృక్పదం, వ్యవహరించే తీరు కూడా మారుతుంది. కనుక బడుగు బలహీనవర్గాల ప్రజలు తమ అభివృద్ధి, సంక్షేమం కోరుకొంటున్నట్లయితే రాజకీయ చైతన్యం కలిగి ఉండటం చాలా అవసరం.


Related Post