ముందస్తు ఉంది కనుకనే కేసీఆర్‌ ఆ ప్రస్తావన చేశారు: రేవంత్‌ రెడ్డి

October 19, 2021


img

సిఎం కేసీఆర్‌ మొన్న తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోవడం లేదని, పదవీకాలం పూర్తయిన తరువాత లోక్‌సభ ఎన్నికలతో పాటే శాసనసభ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దీనిని చాలా ఆసక్తికరంగా విశ్లేషించారు.

సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ముందస్తు ఎన్నికలకు వెళ్ళదలచుకోకపోతే ఎవరూ దాని గురించి మాట్లాడకపోయినా కేసీఆర్‌ పనిగట్టుకొని దాని గురించి ఎందుకు ఇప్పుడు ప్రస్తావించారు?పదవీకాలం పూర్తయిన తరువాతే ఎన్నికలకు వెళ్ళాలనుకొంటే దానికి ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉంది. కనుక పరిపాలనపై దృష్టి పెట్టవలసిన సిఎం కేసీఆర్‌ పార్టీపై ఎందుకు దృష్టి పెడుతున్నారు?అంటే ఆయనకు ముందస్తుకు వెళ్ళే ఆలోచన ఉంది కనుకనే. 

సిఎం కేసీఆర్‌ మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళతారని పార్టీ ఎమ్మెల్యేలలో ఆందోళన నెలకొని ఉంది. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదు కనుక ఒకవేళ వారు అప్రమత్తమైతే పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకే వారిని ఊరడించడానికి ముందస్తు లేదని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. కానీ 2022, ఆగస్ట్ 15తో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సం.లు పూర్తవుతుంది. అప్పుడు రాష్ట్రంలో కొత్త శకం మొదలవుతుందంటూ సిఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఖాయం. గుజరాత్‌ శాసనసభ ఎన్నికలతో పాటు తెలంగాణ శాసనసభ ఎన్నికలు నిర్వహించవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకొని బిజెపికి కాస్త చోటు కల్పించేందుకు సిఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీలు చర్చించుకొని ఒక అవగాహనకు వచ్చారు.    

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోతే పార్టీలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం పొంచి ఉంది కనుకనే ప్లీనరీ, విజయగర్జన సభలు పేరుతో హడావుడి చేసేందుకు సిద్దం అవుతున్నారు. హుజూరాబాద్‌లో గెలిచినా ఓడినా టిఆర్ఎస్‌కు ‘ఫరక్’ పడదని చెప్పుకొంటున్నప్పుడు ఈ సభలు, సమావేశాలు హడావుడి ఎందుకు?ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోతే ఈటల రాజేందర్‌ను బయటకు పంపించినట్లే మంత్రి హరీష్‌రావును కూడా బయటకు పంపించడం ఖాయం,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.


Related Post