దళిత బంధుపై రాజకీయ చదరంగం షురూ

October 19, 2021


img

దళిత బంధు పధకంతో ఓటర్లు ప్రభావితం అవుతారు కనుక ఉపఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దానిని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో దళిత బంధు పధకం ‘గేమ్ ఛేంజర్’ అని టిఆర్ఎస్‌ ముందే చెప్పినట్లుగా, దానిని అమలుచేసినా...చేయకపోయినా అంతిమంగా దాంతో లబ్ది పొందేందుకు టిఆర్ఎస్‌ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఊహించినట్లుగానే టిఆర్ఎస్‌ ఈసీ ప్రకటనను ఆయుధంగా మలుచుకొని తమకు గట్టి సవాలు విసురుతున్న బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్‌ను దెబ్బ తీసేందుకు పావులు కదుపుతోంది. 

ఈటల రాజేందర్‌, బిజెపి నేతలు ఈసీకి లేఖలు వ్రాసి దళిత బంధు పధకాన్ని అడ్డుకొని దళితుల నోటి కాడ కూడు లాక్కొన్నారని, కనుక నియోజకవర్గంలో ఓటర్లు వారిని ఎక్కడికక్కడ అడ్డుకొని నిరసనలు తెలియజేయాలని, గట్టిగా నిలదీయాలని టిఆర్ఎస్‌ నేతలు కోరుతున్నారు. దీంతో కేంద్రప్రభుత్వం దళిత వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైందని వాదిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే ఏమవుతుందో ముందే చూపించినందున ఆయనను ఓడించి బుద్ది చెప్పాలని కోరుతున్నారు. కేంద్రప్రభుత్వం దళితులను పట్టించుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ పధకం ద్వారా ఆర్ధికసాయం అందజేసి వారి జీవితాలలో వెలుగులు నింపాలని ప్రయత్నిస్తుంటే దానిని కూడా కేంద్రప్రభుత్వం ఈసీ ద్వారా అడ్డుకొంటోందని టిఆర్ఎస్‌ నేతలు గాదరి కిషోర్, క్రాంతి కిరణ్, ఎర్రోళ్ళ శ్రీనివాస్, రసమయి, పిడమర్తి రవి తదితరులు వాదిస్తున్నారు.     

అయితే టిఆర్ఎస్‌ ప్రభుత్వం దీనిని హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా తీసుకువచ్చిందే తప్ప దీనిని అమలుచేయాలనే చిత్తశుద్ధి లేదని బండి సంజయ్‌ అన్నారు. ఉపఎన్నిక ముందు ఇటువంటి పధకాలు ప్రకటిస్తే ఎన్నికల కోదండరాం ప్రకారం వాటిని ఈసీ నిలిపివేస్తుందని టిఆర్ఎస్‌కు తెలిసి ఉన్నప్పటికీ హడావుడిగా ప్రకటించారని కనుక దీనికి సిఎం కేసీఆరే బాధ్యత వహించాలని బండి సంజయ్‌ అన్నారు. 

కాంగ్రెస్‌ నేతల వాదన మరోలా ఉంది. టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ కుమ్మక్కై ఇటువంటి నాటకాలు ఆడుతూ హుజూరాబాద్‌ ఓటర్లను మభ్యపెడుతున్నాయని కనుక ఈ ఉపఎన్నికలో వాటిని ఓడించి గట్టిగా బుద్ది చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. చదరంగంలో ఇద్దరే ఆడుతారు కానీ దళిత బంధుపై మొదలైన ఈ రాజకీయ చదరంగంలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ మూడు పార్టీలు ఆడుతున్నాయి. ఈనెల 30న పోలింగ్ పూర్తయ్యేవరకు ఈ ఆట కొనసాగుతూనే ఉంటుంది.


Related Post