బుదవారం నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర షురూ

October 18, 2021


img

వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా ప్రస్థానం’ పేరిట పాదయాత్ర చేయబోతున్నారు. బుదవారం ఉదయం 11 గంటలకు చేవెళ్ళ నియోజకవర్గం భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్రంలో 90 నియోజకవర్గాల గుండా 4,000 కిమీ మేర పాదయాత్ర చేయనున్నారు. బుదవారం నుంచి ఏకధాటిగా 14 నెలల పాటు రోజుకి 12కిమీ చొప్పున ఈ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేయనున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ పార్టీని ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ పార్టీ లక్ష్యమని వైఎస్ షర్మిల ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఆ దిశలోనే ఇప్పుడు అడుగులు వేయబోతుండటం గమనిస్తే ఆమె కాలక్షేప రాజకీయాలు చేయడంలేదని స్పష్టం అవుతోంది. 

ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తొలి విడత పాదయాత్ర పూర్తి చేసి మళ్ళీ రెండో విడత పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా అటువంటి ఆలోచనలు చేస్తున్నారు కానీ ఇంకా ఆచరణలో పెట్టలేదు. సిఎం కేసీఆర్‌ నిన్న శాసనసభ, పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో నూటికి నూరు శాతం సీట్లు టిఆర్ఎస్‌యే గెలుచుకొని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని, కేంద్రంలో కూడా చక్రం తిప్పబోతోందని అన్నారు. కానీ బండి సంజయ్‌, రేవంత్‌ రెడ్డి, వైఎస్ షర్మిల, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ తదితరులు కూడా వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి తామే అధికారంలోకి వస్తామని గట్టిగా చెపుతున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్‌కు వీరందరి నుండి గట్టి పోటీ ఉంటుంది. బహుశః అందుకే సిఎం కేసీఆర్‌ కూడా అప్పుడే విజయగర్జన పేరుతో నవంబర్‌ 15న వరంగల్‌లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దం అవుతున్నట్లున్నారేమో? 


Related Post