మోత్కుపల్లికి గులాబీ కారులో లిఫ్ట్...ఎందుకో?

October 18, 2021


img

మోత్కుపల్లి నర్సింహులు ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ సమక్షంలో టిఆర్ఎస్‌ పార్టీలో చేరారు. సిఎం కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ మోత్కుపల్లిపై ప్రశంశల వర్షం కురిపించారు. గతంలో అనేక ఏళ్ళు మోత్కుపల్లితో కలిసి పనిచేశానని, ఆయన తనకు ఆప్తమిత్రుడని అన్నారు. తమది రాజకీయాలకు అతీతమైన స్నేహమని అన్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ఇద్దరం చాలా బాధపడేవారిమని సిఎం కేసీఆర్‌ అన్నారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం సాధించుకొని విద్యుత్, నీళ్ళు, వ్యవసాయం, వైద్యం...ఇలా ఒక్కో సమస్యను శాస్వితంగా పరిష్కరిస్తున్నామని సిఎం కేసీఆర్‌ అన్నారు. అయినా రాష్ట్రంలో చేయవలసింది ఇంకా చాలా ఉందని అన్నారు. తమకు రాజకీయాలంటే ఒక యజ్ఞమని, కానీ ప్రతిపక్షాలకు ఓ గేమ్ వంటిదని సిఎం కేసీఆర్‌ అన్నారు. మోత్కుపల్లి రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అసలు సిసలైన ప్రతినిదని, ఆయనకు, ఆయన అనుచరులకు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నామని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకోవడం సాధారణ విషయమే కానీ ఆయనను దళిత బంధు ఛైర్మన్‌గా నియమిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అవే నిజమైతే, పార్టీలో కడియం శ్రీహరి, రాజయ్య వంటివారు ఎందరో సీనియర్ నేతలుండగా వారినందరినీ పక్కన పెట్టి సిఎం కేసీఆర్‌ హటాత్తుగా మోత్కుపల్లిని చంకనెక్కించుకోవడం ఆశ్చర్యకరమే. ఈటల రాజేందర్‌ వ్యవహారంలో ఎదురుదెబ్బలు తగులుతుండటం వలన లేదా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులకు చెక్ పెట్టేందుకు సిఎం కేసీఆర్‌ మోత్కుపల్లికి గులాబీ కారులో లిఫ్ట్ ఇస్తున్నారేమో?


Related Post