ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టిఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీపక్ష సమావేశంలో సిఎం కేసీఆర్ ఎన్నికల గురించి చెప్పిన మాట శాసనసభ్యులకు చాలా ఊరట కలిగించిందని చెప్పవచ్చు. ఈసారి టిఆర్ఎస్ పార్టీకి అత్యంత అనుకూల వాతావరణం ఉన్నందున ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోమని, 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత లోక్‌సభ ఎన్నికలతో పాటే శాసనసభ ఎన్నికలకు వెళ్తామని సిఎం కేసీఆర్ నిన్న స్పష్టం చేశారు.
శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉన్నప్పటికీ, ఈసారి కూడా సిఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందంటూ అప్పుడప్పుడు మీడియాలో వస్తున్న వార్తలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆందోళన కలిగించడం సహజం. కనుక సిఎం కేసీఆర్ చేసిన ప్రకటన వారందరికీ చాలా ఊరట కలిగిస్తుంది...వారి అయోమయాన్ని తొలగించి పూర్తి భరోసా ఇచ్చినట్లయింది కనుక ఇక నిశ్చింతగా మిగిలిన రెండున్నరేళ్ళు పని చేసుకోవచ్చు. నిన్న జరిగిన సమావేశంలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని వారు మెరుగు పరుచుకోవాలని సిఎం కేసీఆర్ గట్టిగా హెచ్చరించారు. కనుక వారికీ ఇప్పుడు తగినంత సమయం దొరుకుతుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చి టికెట్లు కేటాయించబోతున్నట్లు సిఎం కేసీఆర్ స్పష్టం చేయడం వారందరికీ చాలా ఆనందం కలిగించే విషయమే. కనుక వారందరూ సిఎం కేసీఆర్‌కు మరింత విధేయంగా పనిచేస్తారు. వచ్చే ఎన్నికలలో సీటు ఖాయమని స్పష్టమైనందున ఆ ఎన్నికలలో గెలిచేందుకు ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలందరూ గట్టిగా కష్టపడతారు. తద్వారా టిఆర్ఎస్ పార్టీకి లబ్ది కలుగుతుందని వేరే చెప్పక్కరలేదు. సిఎం కేసీఆర్ నాయకత్వం, దూరదృష్టికి ఇది మరొక నిదర్శనంగా భావించవచ్చు.
అయితే ఎప్పుడూ ప్రతిపక్షాలను అయోమయానికి గురిచేస్తూ వారు దాని నుంచి తేరుకోకముందే ఎన్నికలకు వెళ్ళే సిఎం కేసీఆర్ ఈసారి ఇంత స్పష్టంగా చెప్పడం కూడా ఆలోచించవలసిన విషయమే. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు ఉంది కనుక అప్పటి పరిస్థితులను బట్టి మళ్ళీ నిర్ణయం మార్చుకొన్నా ఆశ్చర్యం లేదు.