దళిత బంధు పధకంతో రాష్ట్రంలో దళితులకే కాక మోత్కుపల్లి నర్సింహులు వంటి రాజకీయ నిరుద్యోగులకు దశ తిరిగింది. దాంతో ఆయనకు రాజకీయ ఉద్యోగం లభిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
ఈరోజు 11 గంటలకు బేగంపేటలోని లీలానగర్‌లోని ఆయన నివాసం నుంచి 3,000 మంది అనుచరులతో బైక్‌పై ర్యాలీగా ట్యాంక్ బండ్‌కు వెళ్ళి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తరువాత అక్కడి నుంచి గన్‌పార్కు వెళ్ళి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ చేరుకొని సిఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరుతారు. మోత్కుపల్లితో పాటు జిల్లాలోని ఆయన ముఖ్య అనుచరులు కూడా నేడు టిఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని సమాచారం.
మోత్కుపల్లికి దళిత నేతగా మంచి గుర్తింపు ఉన్నందున ఆయనను దళిత బంధు పధకానికి ఛైర్మన్‌గా నియమించబోతున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లికి అపార రాజకీయ అనుభవం, మంచి వాగ్ధాటి కలిగి ఉన్నందున శాసన మండలికి పంపించాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లిని భవిష్యత్‌లో రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కనుక మళ్ళీ చాలా కాలం తరువాత మోత్కుపల్లికి రాజకీయంగా దశ తిరుగబోతోందనే చెప్పవచ్చు.