ఆదివారం తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభ, పార్లమెంటరీపక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సిఎం కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు పలు అంశాలపై పూర్తి స్పష్టత ఇచ్చారు. పలు అంశాలపై వారికి మార్గదర్శనం చేశారు. ఆ వివరాలు క్లుప్తంగా…
• హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్ కంటే 12.5 శాతం ఎక్కువ ఓట్లతో విజయం సాధించబోతున్నామని సర్వేలు స్పష్టం చేశాయి.
• పార్టీ నేతలు హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచార సభ నిర్వహించాలని కోరుతున్నారు. వీలైతే ఈనెల 26 లేదా 27 తేదీలలో సభ నిర్వహిస్తాను. దీనిపై ఒకటి రెండు రోజులలో నిర్ణయం తీసుకొంటాను.
• దళిత బంధు పధకం అమలు సాధ్యాసాధ్యాలపై చాలా లోతుగా ఆలోచించిన తరువాతే ప్రకటించాము. ఆ పధకానికి రూ.1.70 లక్షల కోట్లు అవసరం కాగా రాబోయే ఏడేళ్ళలో మన రాష్ట్ర ఆదాయం రూ.23 లక్షల కోట్లు ఉంటుంది. కనుక ఈ పధకాన్ని నూటికి నూరు శాతం అమలుచేస్తాం. నా మనస్సులో ఇటువంటి పధకాలు ఇంకా చాలానే ఉన్నాయి. వీలువెంబడి ప్రకటిస్తాను.
• త్వరలో బ్రాహ్మలు, వైశ్యులు, రెడ్లు, కమ్మవారి పిల్లల కోసం గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తాం.
• టిఆర్ఎస్ పార్టీకి రూ. 403 కోట్లు ఫిక్స్ డిపాజిట్లున్నాయి. వాటి ద్వారా ఏడాదికి రూ.2 కోట్లు వడ్డీ వస్తుంటుంది. కనుక పార్టీకి డబ్బు సమస్య లేదు.
• ఈ నెల 25న హైదరాబాద్ ప్లీనరీ సభ నిర్వహిస్తాము. ఇటీవల 6,500 మందితో గ్రామ, మండల కమిటీలు ఏర్పాటయ్యాయి. వారు మాత్రమే ప్లీనరీకి హాజరైతే చాలు.
• నవంబర్ 15న వరంగల్‌లో పది లక్షల మందితో విజయగర్జన సభ నిర్వహిస్తాం. దానికి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్‌ఛార్జీగా వ్యవహరిస్తారు. ఈ సభతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలకు పార్టీ తరపున గట్టిగా సమాధానం చెప్పి వాళ్ళ నోళ్ళు మూయిద్దాం.
• ఈ సభకు ప్రతీ నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు హాజరవ్వాలి. వారి తరలింపు కోసం 20 వేల బస్సులు ఏర్పాటు చేయాలి. ఈ బాధ్యతను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కి అప్పగిస్తున్నాను.
• 2018లో లోక్‌సభ ఎన్నికలతో కలిపి శాసనసభ ఎన్నికలకు వెళితే నష్టపోతామనే ఆలోచనతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాము. కానీ ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోము. 5 ఏళ్ళ పదవీకాలం పూర్తి చేసుకొన్న తరువాతే లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్నికలకు వెళ్తాము.
• ఈ ఏడేళ్ళలో రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకొన్నాము. అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నాము. వచ్చే 26 నెలల్లో కూడా మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసి చూపిద్దాము. అప్పుడు 98 శాసనసభ స్థానాలు, 16 లోక్‌సభ స్థానాలు మనమే గెలుచుకొంటాము. ఇదే లక్ష్యంగా ప్రభుత్వాన్ని, పార్టీని పరుగులు పెట్టిస్తాను. కనుక పార్టీలో ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరిస్తూ, రాష్ట్రాభివృద్ధికి గట్టిగా కృషి చేయాలి.
• వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ రాదు. అప్పుడు 16 లోక్‌సభ సీట్లతో మనం కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాము.