సిఎం కేసీఆర్ నిన్న శాసనసభలో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులు హరించివేయాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల లక్నోలో జరిగిన జీఎస్‌ట్ కౌన్సిల్ సమావేశంలో కేంద్రప్రభుత్వం పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే బిజెపి పాలిత రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రాలు గట్టిగా వ్యతిరేకించాయి,” అని అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలలో సుమారు 60 శాతం వరకు పన్ను వసూలుచేస్తున్నాయి. దానిలో కొంత కేంద్రానికి, కొంత రాష్ట్రాలకు వెళుతుంది. ఆ పన్నులో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాను తగ్గించుకొంటే ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి. కానీ అందుకు రాష్ట్రాలు అంగీకరించలేదని సిఎం కేసీఆర్ స్వయంగా చెపుతున్నారు.
కానీ హుజూరాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌రావు మొదలు టిఆర్ఎస్ నేతలందరూ కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తోందని, బిజెపికి ఓట్లు వేస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ.1,000కి పెంచేస్తుందని ప్రచారం చేస్తున్నారు.
శాసనసభలో చర్చ జరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీలో చేర్చడమంటే రాష్ట్ర హక్కులను హరించివేస్తున్నట్లు మాట్లాడుతారు. కానీ ఎన్నికల ప్రచారంలో అందుకు పూర్తి భిన్నంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కేంద్రమే కారణమని ప్రజలకు నమ్మబలుకుతుంటారు. అంతే తప్ప పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేసే పన్నులో తెలంగాణ వాటాను తగ్గించుకొనేందుకు నిరాకరించడం ద్వారా వాటి ధరలు పెరుగుదలతో తమ పాత్ర కూడా ఉందనే విషయం బయటకు చెప్పరు. ఈ విషయంలో టిఆర్ఎస్ ద్వంద వైఖరిని ప్రజలు గుర్తించలేరనుకోవడం అవివేకమే.