టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త! ఇది పండుగ బోనస్ గురించి కాదు. వారి సహకార పరపతి సంఘం మళ్ళీ రుణాలు ఇవ్వబోతోంది. అన్ని సంస్థలు పండుగ బోనస్ ప్రకటిస్తుంటే, టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు మాత్రం వారు పరపతి సంఘంలో దాచుకొన్న సొమ్ములో నుంచి కొంచెం రుణం లభిస్తే అదే శుభవార్తగా భావించాల్సి వస్తున్నందుకు సంతోషించాలో బాధపడాలో తెలీదు. కానీ వీసీ సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచే ఆర్టీసీలో పేరుకుపోయిన ఇటువంటి సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తున్నారు. అందుకు అందరూ చాలా సంతోషిస్తున్నారు.
ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి టీఎస్‌ఆర్టీసీ రూ.1,050 కోట్లు బకాయి పడింది. ఉద్యోగుల జీతాల నుంచి నెలకు 7 శాతం చొప్పున కోసుకొని దానిలో జమా చేసిన సొమ్మును వారి అవసరాలకు ఇవ్వాల్సి ఉండగా ఆ సొమ్మును టీఎస్‌ఆర్టీసీ ఇష్టం వచ్చినట్లు వాడేసుకొంది. ఆర్టీసీ సమ్మె, కరోనా, లాక్‌డౌన్ కష్టకాలంలో అదే ఉండి ఉంటే సంఘం నుంచి ఉద్యోగుల రుణాలు తీసుకొనే అవకాశం ఉండేది. కానీ దానిలో ఒక్క పైసా కూడా లేకపోవడంతో టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇప్పుడు వీసీ సజ్జనార్ చొరవ తీసుకొని పరపతి సంఘం బకాయిలో ముందుగా రూ.100 కోట్లు బ్యాంకు ద్వారా జమా చేయించారు. దీంతో మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు సంఘం నుండి రుణాలు తీసుకొనే అవకాశం లభించింది.
ముందుగా 2019 జూన్ నుండి పెండింగులో ఉన్న రుణాల దరఖాస్తులను, రిటైర్ అయిన ఉద్యోగులకు సంఘంలో వారు దాచుకొన్న డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ బకాయిలను చెల్లించబోతోంది. దీంతో సుమారు 2,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. మళ్ళీ చాలా ఏళ్ళ తరువాత సంఘం నుంచి రుణాలు లభిస్తున్నాయని తెలుసుకొని టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.