తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక అత్యాచార బాధితురాలి కేసులో సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారానికి గురైన ఓ 16 ఏళ్ల బాలిక గర్భవతి కావడంతో అబార్షన్ చేసి 26 వారాల పిండాన్ని తొలగించాలని హైకోర్టు కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.
బాలికపై ఆంజనేయులు అనే ఆమె సమీప బంధువు అత్యాచారం చేశాడు. బాధితురాలు, తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసారు. అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చడంతో ఆమెకు అబార్షన్ చేయించేందుకు ఆమె తల్లి ప్రయత్నించింది. కానీ అప్పటికే ఆమెకు 4 నెలలు నిండటంతో వైద్యులు నిరాకరించారు. దాంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు నిపుణుల కమిటీ బాలికను పరీక్షించి ప్రస్తుతం ఆమెకు 26 వారాలు నిండాయని, కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆమెకు సురక్షితంగా అబార్షన్ చేసి కడుపులో పిండాన్ని తొలగించవచ్చని నివేదిక ఇచ్చింది.
ఈ కేసుపై నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు బాలికకు అబార్షన్ చేసి 26వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. బాలిక కడుపులో పిండం కన్నా బాలిక జీవితం చాలా ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి పరిస్థితులలో బాధితురాలు అవాంఛిత గర్భం వద్దని కోరుకొనే హక్కు కలిగి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె హుందాగా, ఆత్మగౌరవంతో జీవించే హక్కు కలిగి ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ న్యాయస్థానం బాలికకు అబార్షన్ చేయనీయకుండా అడ్డుకొంటే ఆమె ప్రాధమిక హక్కులకు భంగం కలిగించినట్లవుతుందని అభిప్రాయపడింది. దాని వలన ఆమె మానసికంగా, శారీరికంగా, సమాజపరంగా తీవ్ర ఒత్తిడి, బాధలు అనుభవించవలసి వస్తుందని, ఆమె అనారోగ్యం, ఆందోళనతో ఉంటూ గర్భం కొనసాగిస్తే కడుపులో శిశువు ఆరోగ్యం కూడా పాడవుతుందని కనుక ఈ అవాంఛిత గర్భాన్ని తొలగించుకొనే హక్కు బాలిక కలిగి ఉందని, దానిని తొలగించాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.