హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ బుదవారం కమాలాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈటల రాజేందర్‌ను కేసీఆర్ చేరదీసేవరకు ఓ అనామకుడు. ఆయనకు ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. నేడు ఆయనకు సమాజంలో ఇంత గుర్తింపు లభించడానికి కారణం సిఎం కేసీఆర్. కానీ ఈటల రాజేందర్ సిఎం కేసీఆర్‌నే వెన్నుపోటు పొడవాలని ప్రయత్నించారు. ముఖ్యమంత్రి అవ్వాలని కుట్రలు పన్నారు. ఈటల రాజేందర్ మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని భారీగా అక్రమాస్తులు సంపాదించారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను కాజేశారు. ఇప్పుడు తన అక్రమాస్తులను కాపాడుకోవడం కోసమే బిజెపిలో చేరారు.
సిఎం కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ను దెబ్బ తీయాలని చూసినవారు అనేకమంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈ ఉపఎన్నికలో ఓడిపోయిన తరువాత ఈటలకు అదే గతి పడుతుంది. మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనివాడు, ప్రజా సమస్యలను పరిష్కరించలేనివాడు ఇప్పుడు గెలిస్తే ఏమి చేయగలరు? అని ప్రజలు విజ్ఞతతో ఆలోచించి టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను,” అని అన్నారు.
ఈటల రాజేందర్ పేదల అసైన్డ్ భూములు కాజేశారనే ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బహిష్కరిస్తున్నట్లు మొదట టిఆర్ఎస్ నేతలు చెప్పారు. కానీ అదొక్కటే కారణం కాదని వినోద్ కుమార్ మాటలతో అర్ధమవుతోంది. ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి పదవికి పోటీగా తయారవడం కూడా ఓ కారణమని స్పష్టమవుతోంది.
కొన్ని నెలల క్రితం మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కోరస్ పాడతం మొదలుపెట్టిన్నప్పుడు, ప్రతిపక్షాలు ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేసాయి. అప్పుడు ఆయన వాటిని ఖండించకపోవడం, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని అందరూ కోరుకొంటుంటే, ఈటల కేటీఆర్‌కు పోటీగా తయారవడం సిఎం కేసీఆర్ ఆగ్రహానికి కారణమై ఉండవచ్చు.
అదీగాక ఓసారి ‘మేము కూడా గులాబీ జెండా ఓనర్లం...’ అంటూ ఈటల ధిక్కారస్వరం వినిపించడం, అప్పుడపుడు సభలలో తమ ప్రభుత్వం తీరుపట్ల అసంతృప్తిరాగాలు ఆలపించడం వంటివన్నీ సిఎం కేసీఆర్‌కు, పార్టీ అగ్రనేతలకు ఆగ్రహం కలిగించడం సహజం. చివరికి అసైన్డ్ భూముల కబ్జాతో ఈటల రాజేందర్‌కు ఉద్వాసన పలికారు.