ఉపఎన్నిక టిఆర్ఎస్‌కు చిన్నదంటూనే....

October 06, 2021


img

సిఎం కేసీఆర్‌ నిన్న శాసనసభలో మాట్లాడుతూ దళిత బంధు హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం తెచ్చింది కాదని, ఈ ఉపఎన్నిక తమ పార్టీకి చాలా చిన్నదని దాని కోసం అబద్దాలు చెప్పనవసరం లేదన్నారు. టిఆర్ఎస్‌కు ఈ ఉపఎన్నిక చిన్న విషయమని భావిస్తునప్పుడు, హుజూరాబాద్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు, కళాకారులు తదితరులు నామినేషన్లు వేయడానికి వస్తే వారిని పోలీసులతో అడ్డుకోవడం ఎందుకు?కోవిడ్ డబుల్ డోస్‌ వాక్సినేషన్ సర్టిఫికేట్ లేదంటూ అడ్డుకోవడం ఎందుకు?వాక్సినేషన్ సర్టిఫికేట్‌తో వచ్చినవారిని, బలపరిచే వ్యక్తులకి వాక్సినేషన్ సర్టిఫికేట్‌ లేదనే సాకుతో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం దేనికి?అన్నీ ఉన్నవారికి రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్ ఫారంలు ఇవ్వకుండా కుంటిసాకులు చెప్పడం ఏమిటి?అనే ప్రశ్నలకు టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి తప్పించుకోవచ్చు. కానీ అభ్యర్ధులు నామినేషన్లు వేయనీయకుండా పోలీసులు అడ్డుకోవడం టిఆర్ఎస్‌లో అభద్రతాభావాన్ని సూచిస్తున్నట్లు భావించవచ్చు. 

అసలు ఈ ‘డబుల్ వాక్సినేషన్ సర్టిఫికేట్‌’ నిబంధన ఒక్క హుజూరాబాద్‌ ఉపఎన్నికలో నామినేషన్లు వేసేవారికి మాత్రమే వర్తిస్తుందా లేదా దేశవ్యాప్తంగా అమలుచేస్తున్నారా?అనే ప్రశ్నకు రాష్ట్ర ఎన్నికల సంఘం జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఒక్క హుజూరాబాద్‌లోనే దీనిని అమలుచేస్తున్నట్లయితే ఎవరైనా రేపు కోర్టుకి వెళితే న్యాయస్థానంలో మొట్టికాయలు పడతాయి.            

నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండటంతో మంగళవారం 16 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, రిటైర్డ్ ఎమ్లాయీస్ అసోసియేషన్ నేతలు నామినేషన్లు వేసేందుకు హుజూరాబాద్‌ వచ్చారు. కానీ పోలీసులు వారిలో కొందరిని డబుల్ వాక్సినేషన్ సర్టిఫికేట్‌ లేదనే వంకతో అడ్డగించి వెనక్కి పంపేశారు. సర్టిఫికేట్ ఉన్నవారిని వారిని బలపరిచేవారికి సర్టిఫికేట్ లేదనే వంకతో వెనక్కు తిప్పి పంపేశారు. 

ఎన్నికల అధికారి కార్యాలయం చుట్టూ భారీగా పోలీసులను మోహరించి అక్కడకు ఎవరూ చేరుకోలేని పరిస్థితి కల్పించడం చాలా శోచనీయం. ఇదంతా టిఆర్ఎస్‌ అభద్రతాభావానికి అద్దం పడుతోందనుకోవచ్చు ఒకవేళ సిఎం కేసీఆర్‌ చెపుతున్నట్లు ఈ ఉపఎన్నిక టిఆర్ఎస్‌కు చాలా చిన్న విషయంగానే భావిస్తున్నట్లయితే ఈవిదంగా నామినేషన్లు వేయనీయకుండా అభ్యర్ధులను అడ్డుకోవలసిన అవసరమే లేదు. 

అయినా ఈ ఉపఎన్నికలో పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌-ఈటల రాజేందర్‌ మద్యే జరుగుతున్నప్పుడు ప్రజలలో ఎటువంటి గుర్తింపులేనివారు నామినేషన్లు వేస్తుంటే టిఆర్ఎస్‌కు భయం ఎందుకు? అంటే ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోతామని భయపడుతోందా? అనే సందేహం కలుగుతుంది.


Related Post