తెలంగాణలో ప్రతిపక్షాలు తరచూ “సిఎం కేసీఆర్ టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దళితులకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని పక్కన పడేసారని” ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. అయితే సిఎం కేసీఆర్ నిన్న శాసనసభలో మాట్లాడుతూ, తానెప్పుడూ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇవ్వలేదని చెప్పడం విశేషం. గత ప్రభుత్వాలు దళితులకు అసైన్డ్ ల్యాండ్స్ ఇచ్చేందుకు అమలుచేసిన విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని గమనించానన్నారు.
ఒక్కో కుటుంబానికి కనీసం మూడెకరాల భూమి ఉన్నట్లయితే వ్యవసాయం సజావుగా సాగుతుందని కొన్ని అధ్యయనాలలో పేర్కొనడంతో తాను, దళిత రైతుల వద్ద ఎకరం ఉంటే మిగిలిన్ రెండు ఎకరాలు, ఒకవేళ రెండు ఎకరాలు ఉన్నట్లయితే ఒక ఎకరం చొప్పున భూమిని ఇస్తామని మాత్రమే చెప్పానని, అదే విషయం తమ పార్టీ మ్యానిఫెస్టోలో కూడా స్పష్టంగా ఉందని సిఎం కేసీఆర్ అన్నారు.
ఆ ప్రకారం ప్రభుత్వం 16 వేల ఎకరాల భూమిని కొని దళిత రైతులకు ఇచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడు కొందామన్నా భూములు లేవు...ఉన్న భూముల ధరలు ఆకాశానంటుతున్నాయి. కనుకనే దళితులకు భూమి ఇవ్వలేకపోతున్నామని సిఎం కేసీఆర్ అన్నారు.
తమ ప్రభుత్వం ఏదైనా ఓ పధకం ప్రవేశపెట్టే ముందు దాని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి చాలా పకడ్బందీ ప్రణాళికతో లోపరహితంగా అమలుచేస్తామని టిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకొంటుంటారు. కానీ దళితులకు మూడెకరాల భూమి పంపిణీ విషయంలో సిఎం కేసీఆర్ ఇప్పుడు చెపుతున్నది అందుకు పూర్తి భిన్నంగా ఉంది. భూములు లేవు కనుక హామీ అమలుచేయలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెపుతున్నారు. అందుకే టిఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్‌లో దళిత బంధు పధకాన్ని కూడా ఇలాగే నిధులు లేవంటూ అటకెక్కించవచ్చని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.