ఇవాళ్ళ శాసనసభలో ప్రశ్నోతరాల సమయంలో సిఎం కేసీఆర్ సభలో మాట్లాడుతూ, “సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడూ, ఇప్పుడూ కూడా తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురవుతూనే ఉంది. ఆనాడు ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం చేయగా ఇప్పుడు కేంద్రప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. తెలంగాణకు గొప్ప చరిత్ర, అద్భుతమైన సంస్కృతీ సంప్రదాయాలు, చారిత్రిక ప్రాధాన్యత కలిగిన అనేక ప్రదేశాలు, కట్టడాలు, సహజసిద్దమైన పర్యాటక ప్రదేశాలు, గొప్ప కళాకారులు, సాహితీవేత్తలు ఉన్నారు. అయినా ఏవీ... ఎవరూ సరైన గుర్తింపుకు నోచుకోలేదు. ఇటీవల నేను ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసినపుడు ఇవన్నీ వివరించి తెలంగాణ రాష్ట్రం పట్ల సముచితంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసాను. పద్మశ్రీ అవార్డులకు పేర్లు పంపించాలా వద్దా?అని అడిగాను. కానీ స్పందన లేదు. కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకపోయినా మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకొని గుర్తింపు తీసుకువచ్చేందుకు గట్టిగా కృషి చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు,” అని అన్నారు.
బిజెపి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతుంటుంది కానీ సిఎం కేసీఆర్ ప్రస్తావించిన ఏ విషయం పట్ల పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. అయితే మిగిలిన రాష్ట్రాలతో కూడా కేంద్రప్రభుత్వం ఇంచుమించు ఈవిదంగానే వ్యవహరిస్తోందనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో మరుగున పడి ఎటువంటి గుర్తింపుకు నోచుకోని ప్రాంతాలను, చారిత్రిక, పౌరాణిక ప్రాధాన్యత కలిగిన కట్టడాలను, సంస్కృతీ సాంప్రదాయాలను, కళాకారులను, కళారూపాలను కాపాడుతూ గుర్తింపు లభించేలా చేయడంపై కేంద్రప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనబడదు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉండటం, మళ్ళీ దానిని ఏదోవిదంగా నిలబెట్టుకోవడం కోసమే బిజెపి ఎల్లప్పుడూ రాజకీయాలలో తలమునకలవుతుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ వైఖరిలో మార్పు వచ్చి భారత్ గొప్పదనాన్ని గుర్తించగలిగితే ప్రపంచదేశాలు భారత్‌ను చూసే విదానంలో కూడా మార్పు వస్తుంది. అప్పుడు భారత్ పర్యాటక రంగం కూడా ఓ ప్రధాన ఆదాయవనరుగా మారుతుంది.