మంది ఎక్కువైతే మఠానికి చేటన్నట్లు ఒక నియోజకవర్గంలో ఒకే పార్టీలో నేతలు ఎక్కువైతే పార్టీకి తలనొప్పులు తప్పవు. ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అక్కడ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్య ఆధిపత్యపోరు నడుస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదివారం మధిర నియోజకవర్గ స్థాయి సభలో ఆ ముగ్గురూ మాట్లాడిన మాటలు వింటే అవుననిపిస్తుంది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “మధిరలో సీనన్న (నా) బ్రాండ్ ఉంది. నేను ఎప్పుడైనా.. ఎక్కడికైనా వెళతాను. పార్టీ సమావేశాలకు ఫలాన వారుమాత్రమే హాజరు కావాలనో ఫలానావారు హాజరు కాకూడదనో లేదు. అలాగే ఫలాన నాయకుడి వెనుక తిరిగితే పదవులు ఊడగొడతామని బెదిరించడం సరికాదు,” అని అన్నారు.
తరువాత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, “పార్టీలో కులాలు, వర్గాలు లేవు. నిబద్దతతో పనిచేస్తే తప్పకుండా పదవులు వస్తాయి. ఎవరూ ఎవరినీ బెదిరించడం లేదు. పార్టీలో అందరికీ ఒకే ఒక నాయకుడు సిఎం కేసీఆర్. ఆయన నాయకత్వంలోనే అందరూ పనిచేయాలి,” అని అన్నారు.
తరువాత ఎంపీ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌లో ఒకే ఒక బ్రాండ్ ఉంది. అదే కేసీఆర్ బ్రాండ్! పార్టీలో మరెవరి బ్రాండ్స్ లేవు...ఉండవు కూడా. అలాగే పార్టీలో కులాలూ, వర్గాలకు తావులేదు. టిఆర్ఎస్‌లో అందరూ క్రమశిక్షణతో సైనికులలా పనిచేయాలి. పదవులు రాకపోతే ఎవరూ నిరాశ చెందనవసరం లేదు. కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది,” అని అన్నారు.