నేడు మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఉపన్యాసాలు దంచుతారు. తాము ఆచరించని నీతులు, నియమాలను ప్రజలందరూ ఆచరిస్తూ గాంధీ మార్గంలో నడవాలని చెపుతుంటారు. రాజకీయ నాయకులకి గాంధీ జయంతి అంటే మైకు పట్టుకొని ఉపన్యసించడానికి ఓ అవకాశంగా భావిస్తే, ఇంకా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న గల్లీ స్థాయి నేతలు ఆసుపత్రులు, పాఠశాలలకు వెళ్ళి పళ్ళు, పుస్తకాలు పంచిపెట్టి మీడియా కవరేజి ద్వారా నలుగురి దృష్టిలో పడాలని ఆరాటపడుతుంటారు. ఇక ఉద్యోగస్థులైతే గాంధీ జయంతిని శలవు దినంగా భావిస్తుంటారు. కనుక నేడు, రేపు వరుసగా రెండు రోజులు శలవులు కలిసి వచ్చాయని ఊర్లకో, సినిమాలు, షికార్లకో వెళ్ళిపోతుంటారు. మన దేశంలో గాంధీ జయంతి అంటే ఇంతే!
మహాత్మ గాంధీ గొప్పదనం యావత్ ప్రపంచ దేశాలు గుర్తించాయి కానీ భారతీయులపై మాత్రం గాంధీజీ ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. గాంధీజీ విధానాలు, ఆలోచనలు, సిద్దాంతాలు నేటి ప్రపంచానికి సరిపడవని వాదించేవారు కూడా కోకొల్లలున్నారు. అయితే గాంధీజీ ఏమైనా ఆచరణ సాధ్యంకానివి చేయమని చెప్పారా?అంటే కాదు. ఆయన సత్యం, ధర్మం, అహింస, ప్రేమ, పరిశుభ్రత, నిరాడంబర జీవితం పాటించమని మాత్రమే చెప్పారు.
ఎల్లపుడూ సత్యం మాట్లాడు (అబద్దాలు చెప్పకు), ధర్మం (నీతిగా జీవించు), అహింస (ఎవరినీ శారీరికంగా, మానసికంగా హింసించకు), ప్రేమ (సాటి మనిషిని, ప్రాణులను, ప్రకృతిని ప్రేమించు, ద్వేషించకు), పరిశుభ్రత (నీ ఒంటిని, ఇంటినీ, చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకో), నిరాడంబరం (వీలైనంత సింపుల్‌గా జీవించు). ఇవన్నీ నాటికీ, నేటికీ, ఎల్లప్పటికీ వర్తించేవే. గాంధీజీ చెప్పిన ఇంత చిన్నచిన్న విషయాలను ఆచరించడం చాలా కష్టమని భావిస్తూ, సమాజాన్ని కలుషితం చేసుకొంటున్నామనే సంగతి ఎవరూ గ్రహించడం లేదు.
గాంధీజీ చివరిసారిగా 1947, అక్టోబర్ 2వ తేదీన తన పుట్టినరోజున దేశ ప్రజలకు ఏమైనా సందేశం ఇమ్మని మీడియా కోరగా, “నిజంగా నా పుట్టినరోజు మీకు ముఖ్యమని భావిస్తే మీ మనసుల్లో నుంచి సాటి మనుషుల పట్ల ద్వేషాన్ని తొలగించుకోండి,” అని కోరారు. కానీ గాంధీజీ చివరి సందేశాన్ని కూడా నేడు ఎవరూ పాటించలేకపోతున్నారు. మన సమాజం, రాజకీయ పార్టీలు, వాటి నాయకుల మాటలు, తీరుతెన్నులు చూస్తే ఇది అర్ధం అవుతుంది.
కనుక ఇకనైనా గాంధీజీ చెప్పిన ఈ చిన్న చిన్న విషయాలను పాటించే ప్రయత్నం చేద్దామా? అదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.