క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్న బిజెపిలో చేరబోతున్నారు. ఈవిషయం ఆ ఛానల్ సిబ్బంది తెలియజేశారు. ప్రధాని నరేంద్రమోడీ పాలన, బిజెపి సిద్దాంతాల పట్ల ఆకర్షితులై తీన్‌మార్ మల్లన్న బిజెపిలో చేరాలనుకొంటున్నట్లు వారు తెలిపారు.
పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకి పంపించినప్పుడు ఆయన భార్య ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలకు లేఖలు వ్రాశారు. తన భర్త తెలంగాణ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న కారణంగా పోలీసులు ఏదో వంకతో ఆయనపై రకరకాల సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆమె లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తన భర్త బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయాలనుకొన్నారని కానీ అవకాశం లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఒంటరి పోరాటం చేస్తున్న తన భర్తకు బిజెపి అండదండలు చాలా అవసరమని కనుక ఆయనను బిజెపిలో చేర్చుకోవలసిందిగా ఆమె లేఖలో కోరినట్లు సమాచారం.
సాధారణంగా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఏ రాజకీయ నాయకుడైనా ఇదే చేస్తాడు. అందుకు ఉదాహరణగా ఈటల రాజేందర్ ఉన్నారు. ప్రభుత్వం నుంచి బహిష్కరింపబడిన తరువాత ఆయనపై వరుసగా కొన్ని కేసులు నమోదయ్యాయి. అప్పుడు ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో చేరిపోయి బిజెపి కవచం తొడుకొన్నారు. ఇప్పుడు కేసుల ఒత్తిడి నుంచి బయటపడి, అధికార టిఆర్ఎస్‌తో పోరాడేందుకు తీన్‌మార్ మల్లన్న కూడా బిజెపి కవచం తొడుకోవాలనుకొంటున్నారని భావించవచ్చు.