ప్రజలను విభజించి పాలించు (డివైడ్ అండ్ రూల్)పద్దతిలో బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని సుమారు 200 ఏళ్ళు పాలించారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ వారు కనిపెట్టిన ఆ ఫార్ములాను నేటికీ అన్ని రాజకీయపార్టీలు విరివిగా ఉపయోగించుకొంతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో తెలంగాణ సెంటిమెంటు తప్ప ఈ కులపిచ్చి కాస్త తక్కువనే చెప్పవచ్చు. అయితే గడిచిన నాలుగైదు సంవత్సరాలలో ప్రభుత్వం కులాలవారీగా సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టడం, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తుండటంతో ప్రజల మద్య కనిపించని విభజన రేఖలు ఏర్పడుతున్నాయి.
ఉదాహరణకు దళితుల కోసం ప్రభుత్వం దళిత బంధు పధకం ప్రవేశపెట్టగానే రాష్ట్రంలో బీసీలు, ఇతర కులస్తులు తమకు కూడా అటువంటి పధకం అమలుచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో దళితులందరికీ దళిత బంధు పధకాన్ని అమలు చేయలేకపోతునప్పుడు, రాష్ట్రంలో ఇతర కులాలకు ఈ బంధు పధకాలు ప్రవేశపెట్టడం అసంభవం. కనుక ఆయా కుల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇంకా ఈ పధకం యొక్క పూర్తి పర్యవసనాలను ఎవరూ చూడలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం యధాప్రకారం కులాలవారీగా కార్పొరేషన్లు, పధకాలు ప్రకటించుకొంటూపోతోంది.
రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్‌రావు గురువారం మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ మ్యానిఫెస్టోలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాము కనుక త్వరలోనే వైశ్యులకు ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము,” అని తెలిపారు.