సాధారణంగా ఎన్నికలంటే ప్రజలకు కాలక్షేపం కలిగిస్తుంటాయి తప్ప ఇబ్బంది కలిగించవు. కానీ హుజూరాబాద్ ఉపఎన్నికను టిఆర్ఎస్, ఈటల రాజేందర్ (బిజెపి) ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ నేతలు ఇంటింటికీ వచ్చి తలుపు తట్టి తమకే ఓటు వేయాలని అడుగుతుంటే, ఈటల రాజేందర్, బిజెపి నేతలు కూడా వచ్చి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు.
టిఆర్ఎస్ అధికారంలో ఉన్నందున ఆ పార్టీ నేతలు కాస్త గట్టిగానే అడుగుతుంటారు. ఈటల రాజేందర్ గత 15 సం.లుగా ఎమ్మెల్యేగా చేసి ఉండటంతో ఆయనకు అక్కడ బలగం చాలానే ఉంది కనుక వారు కూడా కాస్త గట్టిగానే ప్రజలను అడుగుతున్నారు. ఇప్పుడు ఉపఎన్నిక షెడ్యూల్ కూడా ప్రకటించినందున హుజూరాబాద్‌లో టిఆర్ఎస్, బిజెపిలు మరింత ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తాయి. కనుక పోలింగ్ తేదీ (అక్టోబర్ 30) వరకు ఓటర్లు మరింత ఒత్తిడి పెరగవచ్చు.
నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే సభలు, సమావేశాలు పెట్టుకోవచ్చు. రోడ్ షోలు చేసుకోవచ్చు. కానీ ప్రతీరోజు ఎవరో ఒకరు వచ్చి తలుపు తట్టి తమకే ఓటువేయాలని అడుగుతుండటం హుజూరాబాద్ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో ఓటర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
నేడో రేపో కాంగ్రెస్ కూడా అభ్యర్ధిని ప్రకటిస్తే, కాంగ్రెస్ నేతలు కూడా హుజూరాబాద్‌లో ప్రచారం మొదలుపెడితే, ఓటర్లపై ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. సామాన్యంగా జరగవలసిన ఈ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తుండటం వలననే ఈ సమస్య ఉత్పన్నం అయ్యిందని చెప్పక తప్పదు.