దిశ ఎన్‌కౌంటర్‌ విచారణ తీరుపై జస్టిస్ సిర్పూర్కర్ కమీషన్‌ ఆగ్రహం

September 30, 2021


img

సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవహక్కుల హక్కుల కమీషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారణ జరిపిన తీరును జస్టిస్ సిర్పూర్కర్ కమీషన్‌ తప్పు పట్టింది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరిపి నిజానిజాలు తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, పోలీసులు ఏది చెపితే అదే వ్రాసుకొని నివేదిక తయారుచేసిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఘటనా స్థలంలో నిందితుల మృతదేహాలు పడి ఉన్న తీరును గమనించకుండా, వారిపై పోలీసులు ఎక్కడి నుంచి కాల్పులు జరిపారనే విషయం తెలుసుకోకుండా, పోలీసులు ఏది చెపితే అదే వ్రాసుకొని విచారణ ముగించడం సరికాదని జస్టిస్ సిర్పూర్కర్ కమీషన్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. 


సుప్రీంకోర్టు ఆదేశంతో ఈ కేసు విచారణకు హైదరాబాద్‌ వచ్చిన జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమీషన్‌ దిశ నిందితులను ఉంచిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ వాచ్‌మ్యాన్‌ను, చటాన్‌పల్లిలో ఘటనాస్థలం వద్ద క్రైమ్ సీన్ రిక్రీయేట్ చేసేందుకు నిందితులను తీసుకువెళ్ళిన వాహనాల డ్రైవర్లను ప్రశ్నించి వారి నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టింది. ఎన్‌కౌంటర్‌ చేయబడిన నలుగురు నిందితులకు పంచనామా చేసిన పోలీసులను, పోస్టుమార్టం చేసిన వైద్యులను, ఎన్‌కౌంటర్‌లో గాయపడిన పోలీసులకు చికిత్స చేసిన వైద్యులను జస్టిస్ సిర్పూర్కర్ కమీషన్‌ నేడు ప్రశ్నించనుంది. తరువాత మాజీ సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను కూడా ప్రశ్నించనున్నట్లు సమాచారం.


Related Post