ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం భారత పౌరవిమానయాన శాఖకు లేఖ వ్రాసింది. భారత్- ఆఫ్ఘనిస్తాన్‌ల మద్య మళ్ళీ పౌరవిమాన సేవలు ప్రారంభించాలని ఆఫ్ఘనిస్తాన్ పౌరవిమానయాన శాఖ మంత్రి అల్హజ్ హమీదుల్లా అఖుంజాదా ఈనెల 7వ తేదీన పంపిన లేఖ ద్వారా భారత్‌ను కోరారు. అయితే భారత్ ఇంతవరకు స్పందించలేదు. భారత్‌తో పాటు ఇతర దేశాలన్నిటికీ లేఖలు వ్రాసినట్లు ఆయన తెలిపారు. అమెరికా దళాలు కాబూల్ విమానాశ్రయం నుంచి తిరిగి వెళ్ళిపోయిన తరువాత జరిగిన బాంబు దాడిలో విమానాశ్రయం, రన్ వే దెబ్బతిన్నాయని, వాటిని తమ మిత్ర దేశమైన ఖత్తర్ సహాయసహకారాలతో మరమత్తులు చేసుకొని విమానాశ్రయాన్ని పునరుద్దరించామని, కనుక భారత్-ఆఫ్ఘనిస్తాన్‌ల మద్య పౌరవిమాన సేవలు ప్రారంభించాలని మంత్రి అఖుంజాదా భారత్‌కు విజ్ఞప్తి చేశారు.
ఉగ్రవాదులైన తాలిబన్లు ప్రభుత్వ పగ్గాలు చేపట్టినంత మాత్రాన్న సజ్జనులైపోరు....వారి ఆలోచనా విధానం మారిపోదు...వారి ఉగ్రవాద లక్షణాలు వదులుకోరు. కనుక అటువంటి ప్రభుత్వంతో వ్యవహారాలు నడపాలంటే ఏ దేశామైన చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది లేకుంటే వాటి పర్యవసానాలు ఏవిదంగా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. అందుకే భారత్ కూడా తాలిబన్ ప్రభుత్వంతో సంబంధాలు నెలకొల్పుకోవడానికి తొందరపడటం లేదని భావించవచ్చు.