మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఆరేళ్ళు సర్వీసు ఉండగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెపుతున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలను, వారి నేతలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తన పర్యటనలలో ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను, సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పధకంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నిన్న వనపర్తి జిల్లా పెబ్బేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో బీఎస్పీ కార్యకర్తలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “ప్రభుత్వం బహుజనులకు దళిత బంధు వంటి తాయిలాలు పంచిపెట్టి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్ర జనాభాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 85 శాతం ఉంటే, 15 శాతం ఉన్న అగ్రవర్ణాలకు చెందిన నేతలు రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. కానీ ఇటువంటి ఎన్ని తాయిలాలు ప్రభుత్వం పంచిపెట్టినా బహుజనుల ఓట్లు కొనలేదని గ్రహిస్తే మంచిది. మనకు పదవులు, రాజ్యాధికారమే కావాలి. వచ్చే ఎన్నికలలో గెలిచి ఏనుగు మీద ఎక్కి ప్రగతి భవన్‌కు వెళ్దాము,” అని అన్నారు.
రాష్ట్రంలో జనాభా ప్రతిపదికన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ వాస్తవ పరిస్థితులను గమనించకుండా తాయిలాలకు ఎవరూ లొంగరని చెప్పడం రాజకీయ అజ్ఞానంగానే భావించాల్సి ఉంటుంది.
ఒకవేళ తాయిలాలకు ఎవరూ లొంగరని భావిస్తే ప్రభుత్వం తలకు మించిన భారం ఎత్తుకొని దళిత బంధు పధకం ఎందుకు ప్రవేశపెడుతుంది?అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో ఓటర్లకు డబ్బు, బహుమతులు, మద్యం వగైరా ఎందుకు పంచిపెడుతున్నట్లు? కనుక ప్రవీణ్ కుమార్ తన లక్ష్యం సాధించాలంటే వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుంది తప్ప ‘వచ్చే ఎన్నికలలో గెలిచి ఏనుగు మీద ఎక్కి ప్రగతి భవన్‌కు వెళ్దామని...’ ఉపన్యాసాలు ఇవ్వడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. ఒకవేళ తన వాదనలే నిజమని నిరూపించదలిస్తే హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసి నిరూపించుకొనే అవకాశం నేటికీ ఉంది.