హుజూరాబాద్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్‌కు నిన్న షెడ్యూల్ ప్రకటించడంపై బిజెపి అభ్యర్ధిగా భావించబడుతున్న ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నేను రాజీనామా చేసి ఐదు నెలలు గడిచింది. ఇప్పటికి నా నిరీక్షణ ముగిసింది. ఇప్పుడు అసలు యుద్ధం మొదలవబోతోంది. నేను రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చింది గనుకనే సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి జనం మద్యకు వస్తున్నారు. దళిత బంధు పధకం ప్రకటించి హడావుడిగా అమలుచేస్తున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీష్‌రావుతో సహా ఓ డజను మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మకాం వేసి ప్రజలను, కుల సంఘాల నేతలను, సర్పంచులను నయన్నో భయాన్నో లొంగదీసుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టిఆర్ఎస్‌ను గెలిపిస్తేనే దళిత బంధు పధకం ఇస్తామని బెదిరిస్తున్నారు. ప్రతీ ఇంటిపై గులాబీ జెండా ఎగురవేయాలని లేకుంటే సంక్షేమ పధకాలు దక్కవని ప్రజలను బెదిరిస్తున్నారు. చివరికి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను కూడా మమ్మల్ని కలవకుండా కట్టడి చేస్తున్నారు. నియోజకవర్గంలో గత ఐదు నెలలుగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. టిఆర్ఎస్ మంత్రులు, నేతల అరాచకాలను ప్రజలు కూడా గమనిస్తూ ఓపికగా వారికి బుద్ది చెప్పేందుకు ఉపఎన్నిక కోసం ఎదురు చూస్తున్నారు. ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఈ యుద్ధంలో హుజూరాబాద్ ప్రజలు నావైపే నిలుస్తారు. నన్నే గెలిపిస్తారు,” అని అన్నారు.